రియాద్ : సౌదీ అరేబియా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో నిరూపించే సంఘటన మరొకటి చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో సింగర్‌ను కౌగిలించుకుందని ఓ మహిళను సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం తైఫ్ సిటీలో గాయకుడు మజిద్ అల్ మోహండిస్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో స్టేజి వద్ద ఉన్న మహిళ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. ఆమెను ఆపడానికి సిబ్బంది ప్రయత్నించారు. కానీ ఆమె వారిని నెట్టి మరీ అతన్ని కౌగిలించుకున్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గాయకుడి ప్రదర్శన కొనసాగింది. సౌదీ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ఎలాంటి సంబంధం లేని పురుషులను సౌదీ మహిళ తాకరాదు. దీంతో సదరు మహిళపై ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
మహిళా సాధికారత విషయంలో ఇప్పుడిప్పుడే సౌదీ అరేబియా మెల్లగా అభ్యుదయపథం వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. చమురుపై ఆధారపడుతున్న సౌదీ భవిష్యత్తులో దాని నుంచి దూరంగా జరగాలనే ఉద్దేశంతో విజన్ 2030 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. మహిళల అభ్యున్నతికి ఆటంకాలుగా ఉన్న చట్టాలకు సవరణలు చేస్తూ వారికి సడలింపులు ఇస్తున్నారు. మహిళలు డ్రైవింగ్ చేయటంపై నిషేధం ఎత్తివేత, ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ సౌదీలో మహిళల పట్ట కఠినంగా వ్యవహరించే చట్టాలు ఇంకా కొన్ని అమలులో ఉన్నాయి. డ్రెస్‌కోడ్ నిబంధన ఉంది. బహిరంగ ప్రదేశాల్లో తల నుంచి కాళ్ల దాకా బురఖా ధరించాలి. గాయకున్ని కౌగిలించుకున్న మహిళ కూడా బురఖా ధరించే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment