సౌదీ రాజు అబ్దుల్లా మృతి | Saudi Arabia's King Abdullah bin Abdulaziz dies | Sakshi
Sakshi News home page

సౌదీ రాజు అబ్దుల్లా మృతి

Published Sat, Jan 24 2015 1:47 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

సౌదీ రాజు అబ్దుల్లా మృతి - Sakshi

సౌదీ రాజు అబ్దుల్లా మృతి

రియాద్: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్(90) మరణించారు. డిసెంబర్ నుంచి న్యుమోనియాతో బాధపడుతూ కొన్నాళ్లుగా కృత్రిమ శ్వాసపై ఉన్న ఆయన స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంటకు తుది శ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్న ప్రార్థనల అనంతరం ఆయన మృతదేహాన్ని సౌదీ రాజధాని రియాదలోని ఇమామ్ టర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో ఖననం చేశారు.

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు  ఎర్దోగన్ తదితర దేశాల అధినేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అబ్దుల్లా మృతితో ఆయన సవతి సోదరుడు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్(79) సౌదీ అరేబియా తదుపరి రాజుగా బాధ్యతలు స్వీకరించారు. వారి మరో సోదరుడు ముఖ్రిన్ బిన్ ను యువరాజుగా రాజకుటుంబం ప్రకటించింది. అబ్దుల్లా, సల్మాన్, ముఖ్రిన్.. ఈ ముగ్గురు సౌదీ రాజ్యాన్ని స్థాపించిన రాజు అబ్దుల్ అజీజ్(ఇబన్ సౌద్) కుమారులు. ఇస్లాం జన్మస్థలమైన సౌదీ అరేబియాలో ముస్లింలంతా ఐక్యంగా ఉండాలని రాజుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సల్మాన్ పిలుపునిచ్చారు.  2012 నుంచి సల్మాన్ యువరాజుగా, రక్షణ మంత్రిగా వ్యవహరించారు.
 
1996 నుంచే అనధికారిక రాజు..
2005లో సౌదీ రాజుగా అధికారికంగా నియమితుడైనప్పటికీ.. 1996 నుంచే అబ్దుల్లా  దేశ పాలనాబాధ్యతలను నిర్వర్తించారు. 1996లో నాటి రాజు ఫాద్ గుండెపోటుకు గురవడంతో అబ్దుల్లా పాలనాపగ్గాలను చేపట్టారు. అంతకుముందు 1982నుంచి ఆయన సౌదీ యువరాజుగా ఉన్నారు. ముస్లిం సంప్రదాయ వాదం బలంగా ఉన్న సౌదీని సంస్కరణలతో ఆధునికత దిశగా తీసుకెళ్లేందుకు అబ్దుల్లా విశేష కృషి చేశారు. అగ్రరాజ్యం అమెరికాకు మధ్యప్రాచ్యంలో విశ్వసనీయ నేస్తంగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.  ఆయనకు భారత్ అంటే అభిమానం. భారత్‌ను ఆయన తన రెండో గృహమని కూడా ప్రకటించారు. 2006లో భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రణబ్, మోదీ నివాళులు.. అబ్దుల్లా మృతికి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కేరళ సీఎం చాందీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ ఒక మంచి స్నేహితుడిని కోల్పోయిందని ప్రణబ్ పేర్కొన్నారు. కొన్నిరోజుల క్రితమే ఆ దేశ యువరాజుతో అబ్దుల్లా ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశానని మోదీ గుర్తు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement