శిల్పం.. సూక్ష్మం
లండన్ : ఈ బుల్లి శిల్పాన్ని చిన్న చీమ తల మీద నిల్చోబెట్టవచ్చు. వెంట్రుక మీద బ్యాలెన్సింగ్ చేయించవచ్చు. ఫొటో చూడండి. సూది బెజ్జంతో దీన్ని పోల్చినా.. ఎంత చిన్నదిగా ఉందో చూశారుగా.. వీటి సృష్టికర్త లండన్‌కు చెందిన నానో శిల్పకారుడు జాంటీ హర్విట్జ్. ఇలాంటివి మొత్తం ఏడింటిని రూపొందించారు. వీటిలో అతి పెద్దది మన వెంట్రుక మందముంటే.. మిగతావి అందులో సగం కన్నా చిన్నవేనట! 10 నెలల కృషి అనంతరం జాంటీ వీటిని తయారుచేశారు. వీటిని చూడటానికి కేన్సర్ కణాలను పరిశీలించడానికి వాడే అత్యాధునిక మైక్రోస్కోప్‌ను ఉపయోగించారు.
తయారీ ఇలా..: ముందుగా ఓ మోడల్‌ను ఫొటోలు తీశారు. ఆమెకు అన్ని వైపులా మొత్తం 250 కెమెరాలు పెట్టి.. అణువణువు క్లిక్‌మనిపించారు. తర్వాత వాటిని అత్యధిక సామర్థ్యమున్న కంప్యూటర్‌లో ఫీడ్ చేసి.. డిజిటల్ బొమ్మను రూపొందించారు. అనంతరం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి.. ఈ అద్భుత నానో శిల్పాలను రూపొందించారు. ఇంతకీ వెంట్రుక ఎంత మందముంటుందో తెలుసా? 40 నుంచి 50 మైక్రాన్లు. మైక్రాన్ అంటే మిల్లీ మీటర్‌లో వెయ్యో వంతు. దాని లెక్కన అంచనా వేసుకోండి. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో..
యాంటీ క్లైమాక్స్..
జాంటీ గొప్పతనమంతా విన్నాం. అయితే.. ఆ శిల్పాలను మనం చూడాలంటే.. ప్రస్తుతం ఇలాంటి ఫొటోలే గతి. ఎందుకంటే.. వీటిని తయారుచేసిన కొన్ని గంటలకు జాంటీ సహచరుడొకడు.. వీటిని వేరే యాంగిల్‌లో చూడాలనే ఉత్సాహంతో మైక్రోస్కోప్ కింద ఉన్న అద్దాన్ని కదిలించాడు. అవి కింద పడ్డాయి. ఏంటీ.. మైక్రోస్కోప్‌లో కనిపించడం లేదంటూ ఆందోళన చెందాడు. ఈ తడబాటులో అతడి చిటికెన వేలు అద్దం పక్కన యథాలాపంగా ల్యాండ్ అయింది. అంతే.. సర్వనాశనం.. 7 నానో శిల్పాలు చరిత్రలో కలిసిపోయాయి.