అది సెలబ్రిటీలకు, యువ రాజులకు స్వర్గధామం. ప్రైవేటు బీచుల మీదుగా వీచే చల్లటిగాలులు, అహ్లాదకరమైన వాతావరణంతో అలరారే పరిసరాల మధ్య అనంద డోలికల్లో తేలిపోతూ కమ్మని సువాసనల మధ్య కమనీయ ముచ్చట్లతో మురిసిపోతూ పసందైన వంటకాల రుచులను ఆస్వాదిస్తూ ‘స్వర్గమే కదా ఇదీ!’ అంటూ తూగే ప్రాంతమది. నిజంగా చెప్పాలంటే సెలబ్రిటీలకు అది ఓ రహస్య స్వర్గం. రసమయ లోకం. అన్యులకు అందని ఆనందాల తీరం. అక్కడి రాయల్ విల్లా నిజంగా రారాజుల విల్లానే. అందుకే ప్రముఖ హాలీవుడ్ సెలిబ్రిటీలు లియోనార్దో డికాప్రియా, మెరిల్ స్ట్రీప్, క్రిస్టినో రొనాల్డో, కైలి మినోగ్, మెల్‌గిబ్సన్‌లు తరచు వచ్చి పోతుంటారు.
గ్రీస్‌లోని అథేనియా రివీరాలో ఓ ప్రైవేటు ద్వీపకల్పమే ఈ స్వర్గధామం. 72 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమై 16 హోటల్ బీచెస్, 8 ప్రైవేటు బీచెస్, రాయల్ విల్లాలు ఉన్నాయి. బంధు, మిత్రులతో కాకుండా సకల పని వారలతో కలసి వచ్చినా వారందరికి తగిన వసతులు అందుబాటులో ఉన్నాయి. విల్లాలలోనే కాకుండా హోటళ్లలో కూడా విశాలమైన పడక గదులు, విశ్రాంతి గదులతో పాటు, స్వీయ పాకానికి వంట శాలలు, అధునిక మధు శాలలు, వ్యాయామానికి ప్రైవేటు జిమ్ములు ఉన్నాయి. సూర్య చంద్రుల ఆగమ, నిష్క్రమణ సంధ్యా కాంతులకు అనుగుణంగా, అల్పాహార, మధ్యాహ్న, విందు భోజనాలను ఆస్వాదించేందుకు అన్ని దిక్కుల అహ్లాద ఏర్పాట్లు ఉన్నాయి. ఒకటేమిటీ మార్బుల్ బాత్‌రూమ్‌లతోపాటు ఇండోర్, అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అవసరాన్నిబట్టి వాటిలోని నీరును వేడినీరుగా కూడా మార్చుకునే వెసలుబాటూ ఉంది. 24 గంటలపాటు వంటవాడు అందుబాటులో ఉండడమే కాకుండా 24 గంటలపాటు సర్వీసు ఉంటుంది.
సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా ఈ స్వర్గధామంలో అడుగుపెట్టేందుకు ఓ హెలిపాడ్‌తో పాటు హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా చెప్పుకుంటే అమ్మాయికి అబ్బాయి పెళ్లి ఆఫర్ చేసినప్పుడు హెలికాప్టర్ గుండా పుష్పాభిషేకం కూడా చేస్తారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా! అత్యంత ఖరీదు కాబోలు అనుకుంటే పొరపాటే! ఇక్కడి అన్నింటి కన్నా విలాసవంతమైన 400 చదరపు అడుగుల రాయల్ విల్లాలో ఒక రోజు ఉండేందుకు కేవలం లక్ష రూపాయలే. అతిథుల కోసం సూట్లతోపాటు హోటళ్లలో ఒకటేసి గదులు కూడా ఉన్నాయి. పనివారలు, వ్యక్తిగత సిబ్బంది కోసం ఇతర గదులు ఉన్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఇక్కడి సొంత వంటవాళ్లను వెంట తెచ్చుకుంటారు.‘మామ మియా’ సినిమాను 2008లో ఇక్కడే తీశారు. అప్పుడు ఆ సినీ తారలలోపాటు యావత్ నిర్మాణ సిబ్బంధి ఇక్కడే ఉన్నారు. అందుకనే వివిధ స్థాయిల వ్యక్తులను, వారి అవసరాలను, అభిరుచులను దష్టిలో పెట్టుకొని ఇక్కడ తగిన ఏర్పాటు చేశారు.
ప్రముఖ గ్రీక్ ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్స్ ఇక్కడి వసతులను ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. రాల్ఫ్ లారెన్, కామెరిచ్, విల్లా లూమి, మురానో లాంటి ప్రముఖ నిపుణులు ఇక్కడి ఫర్నీచర్‌కు రూపకల్పణ చేశారు. అతిథుల అభిరుచులకు అనుగుణంగా పెద్ద పెద్ద చెట్లను తొలగించి కూడా వాటి స్థానంలో ఎప్పటికప్పుడు ఇతర చెట్లను రీప్లాంట్ చేయడం ఇక్కడ మరో విచిత్రం, విశేషం అని కూడా చెప్పవచ్చు. అందమైన అమ్మాయిలు మరింత అందంగా మెరిసి పోవాలనే ఉద్దేశంతోనేమోగానీ రాయల్ విల్లా నిర్వాహకులు ఇటీవల అమ్మాయిల కోసం 24 క్యారెట్ల బంగారు స్విమ్మింగ్ సూట్లుకు తెప్పించారట!
సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!
Published Mon, Jul 22 2019 4:28 PM | Last Updated on Mon, Jul 22 2019 4:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment