అమ్మాయి కదాని సెల్ఫీ దిగితే..!
దొంగతనం చేయడం వరకు ఓకే.. చేసిన తర్వాత బాధితులలోని ఓ మహిళతో సెల్ఫీలు దిగాడు. అక్కడితో కూడా ఆగలేదు. ఆ ఫొటోలను స్నాప్‌చాట్‌లో షేర్ చేశాడు. అంతే.. పోలీసులకు దొరికిపోయాడు. విక్టర్ అల్మాంజా మార్టినెజ్ అనే 18 ఏళ్ల యువకుడిని దోపిడీ నేరం మీద పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీలో అతడితో పాటు పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. విక్టర్, అతడి ఇద్దరు స్నేహితులు కలిసి కాలిఫోర్నియాలోని లోవర్ పార్క్ ప్రాంతంలో ఓ ఇంటికి వెళ్లారు.
అక్కడివాళ్లను తుపాకులతో బెదిరించి, వాళ్ల కారుతో సహా విలువైన వస్తువులు దోచుకుపోయారు. బాధితుల కుటుంబంలో ఉన్న ఓ మహిళ విక్టర్‌తో స్నాప్‌చాట్ సమాచారం షేర్ చేసుకుంది. ఇద్దరూ కలిసి ఓ సెల్ఫీ కూడా దిగారు. ఆ సెల్ఫీ ఆధారంగా విక్టర్‌ను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. సాయుధ దోపిడీ, కిడ్నాప్ నేరాలు అతడిమీద మోపి ప్రస్తుతం మాంటెరీ కౌంటీ జైల్లో పెట్టారు.