
కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం రాత్రి సాయుధులైన ఆగంతకులు నగరంలోని ఓ స్టార్ హోటల్‌లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం భారీగానే సంభవించినట్లు సమాచారం.
కాబూల్‌లోని అతిపెద్ద హోటళ్లలో ఇంటర్ కాంటినెంటల్ ఒకటి. సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో హోటల్ వంట గది ద్వారా ప్రవేశించిన దుండగలు విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఆపై గ్రేనేడ్ దాడులు చేయటంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటన నుంచి తప్పించుకున్న హోటల్ మేనేజర్ అహ్మద్ హరిస్ నయబ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హ్యాండ్ గ్రేనేడ్‌లతో హోటల్‌లోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయిస్తున్నారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు ప్రకటించిన భద్రతా దళాలు.. ఐదుగురు పౌరులు మృతి చెందినట్లు చెబుతూ ఆ సంఖ్య ఇంకా పెరగొచ్చనే సంకేతాలు అందిస్తోంది. మరోపక్క హోటల్‌కు సమీపంలో ఉన్న పాక్ ఎంబసీ కార్యాలయంలో కూడా కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
కాబూల్ హోటళ్లపై దాడులకు అవకాశం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరించిన కొద్దిరోజులకే ఈ దాడి చోటు చేసుకోవటం గమనార్హం. గతంలో(2011) ఇదే హోటల్ పై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసి 24 మందిని పొట్టనబెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment