షాంపూలతో క్యాన్సర్ ముప్పు!
న్యూయార్క్: షాంపూలో ఉపయోగించే రసాయనాలతో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలలో ఈ విషయం వెల్లడయింది. వినియోగదారులు విరివిగా ఉపయోగించే షాంపూలు, కాస్మొటిక్ పదార్దాలు, బాడీ లోషన్ల తయారీలో ఉపయోగించే రసాయనాల ద్వారా మహిళల్లో 'రొమ్ము క్యాన్సర్' వచ్చే అవకాశం పెరుగుతుందని ఈ పరిశోధనలో తేలింది. దీనితో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
పరిశోధనకు సంబంధించిన వివరాలను కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డేల్ లీట్మెన్ వెల్లడిస్తూ.. 'తక్కువ పరిమాణంలో వాడుతున్నప్పటికీ నిలువ కొరకు వాడే రసాయనాలు క్యాన్సర్ వ్యాధికి కారకాలవుతున్నాయి. శరీరంలో ఈస్ట్రోజన్ను పోలినటువంటి రసాయనాలయిన పారాబీన్స్ను షాంపూలు, కాస్మొటిక్స్లలో స్వల్ప మోతాదులో వాడుతున్నారు. వీటి వాడకం వలన క్యాన్సర్తో పాటు మహిళల్లో అనేక రుగ్మతలు తలెత్తుతాయి' అని తెలిపారు. వివిధ ఉత్పత్తుల తయారీలో విరివిగా ఉపయోగించే పారాబీన్స్కు సంబంధించి, అవెంతవరకు సురక్షితం అన్న దానిపై విస్తృత పరిశోధన జరగాలని శాస్త్రవేత్తలు తెలిపారు.