కొంచెం తాగినా ముప్పు ముప్పే..
మందుబాబులు తరుచుగా చెప్పుకొని సమర్థించుకునే మాటలు.. 'ఎప్పుడో ఒకసారి తాగితే ఏమీ కాదు', 'కొంచెం తాగితే ఫర్వాలేదు'. అయితే ఈ అప్పుడప్పుడు, తక్కువ పరిమాణం అనే మాటలు కూడా ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగించేవే అని తాజా పరిశోధనలో తేలింది. రోజుకు ఒక గ్లాసు వైన్ తీసుకునే వారిలో సైతం ఏడు రకాల క్యాన్సర్లు సంభవించే ముప్పు పెరుగుతోందని న్యూజిలాండ్కు చెందిన ఒటాగో మెడికల్ స్కూల్ పరిశోధక బృందం నిర్వహించిన తాజా పరిశీలనలో తేలింది.
రోజుకు ఒక గ్లాసు రెడ్‌వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న వాదన అర్ధరహితమైందని ఈ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆల్కహాల్ పరిమాణం తక్కువగా తీసుకునే వారిలో సైతం నోరు, గొంతు, అహారవాహిక, కాలేయం, పెద్దప్రేగు వంటి శరీర భాగాలలో క్యాన్సర్లు సంభవించే ముప్పు పెరుగుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జెన్నీ కానర్ తెలిపారు. 2012 నుంచి క్యాన్సర్ కారణంగా సంభవించిన మరణాలను పరిశీలిస్తే.. ప్రతి 20 మరణాల్లో ఒకటి(ఐదు శాతం) ఆల్కహాల్ మూలంగానే అని కానర్ వెల్లడించారు. అయితే.. తీసుకునే ఆల్కహాల్ పరిమాణం పెరిగిన కొద్దీ క్యాన్సర్ ముప్పు శాతం కూడా పెరుగుతుందని ఆమె వెల్లడించారు.