గురకతో ఆ ముప్పు పెరుగుతోంది!
మ్యూనిచ్: నిద్రలో గురక పెడుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పరిశోధకులు. గురక పెట్టేవారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. మరీ ముఖ్యంగా గురకపెట్టే పురుషులు జాగ్రత్తగా ఉండాలని చెబుతునారు. గురక పెట్టే సమయంలో గాలి తీసుకోవడంలో ఏర్పడే అవరోధం వల్ల శరీరంలోని ముఖ్యమైన కణజాలాలాకు అందే ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుందని, ఈ స్థితి క్యాన్సర్కు కారణం కావడమే కాకుండా వేగంగా వ్యాప్తి చెందడానికి దోహదం చేస్తుందని మ్యూనిచ్లో జరిగిన యురోపియన్ అసోసియేషన్ ఆరోగ్య సదస్సులో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గడం వల్ల క్యాన్సర్ కణాలు గ్రహించే ప్రొటీన్ల శాతం పెరుగుతుందని, తద్వారా అవి వేగంగా వృద్ధి చెందుతాయని డాక్టర్ ఆంటోని విలాసికా తెలిపారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గడం అనేది వాటి మూత్రపిండాల్లోని కణాల అసహజ పెరుగుదలకు కారణం అయినట్లు రుజువైందని, మనుషుల్లో సైతం మూత్రపిండాల కణాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రొఫెసర్ అర్ముఫ్ స్టెంజల్ వెల్లడించారు.