జార్జియా ఆస్పత్రిలో మిరాకిల్
జార్జియా: జార్జియాలో అద్భుతం చోటుచేసుకుంది. మూత్ర పిండాల సమస్యను చూపించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లిన మహిళ పండంటి బిడ్డను ప్రసవించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే అసలు ఆమె గర్భవతి అనే విషయం, అది కూడా నెలలు పూర్తయ్యాయనే సంగతి ఆ మహిళకు అస్సలు తెలియదంట. అంతేకాదు.. తనకు కిడ్నీ సమస్య ఉందని చెప్పగా పరీక్షించిన వైద్యులు గర్భందాల్చి ఎన్నాళ్లయిందని ప్రశ్నించగా తాను గర్భవతి ఏంటని కోపంతో లాగిపెట్టి కొట్టిందట. ఎట్టకేలకు ఆమెకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయగా నిజంగానే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. జార్జియాలోని లోకస్ట్ గ్రోవ్కు చెందిన స్టెపనీ జాగర్స్ అనే మహిళ అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లి. ఆమె భర్త మైఖెల్ జాగర్స్ ఓ టీవీ చానెల్లో పనిచేస్తాడు. వారికి ఇప్పటికే జాకబ్(16), డిలాన్(11) అనే కుమారులతోపాటు శాడీ అనే రెండేళ్ల కూతురు కూడా ఉంది. వాస్తవానికి ఆమె గర్భం రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటుందట. పీరియడ్స్ కూడా సక్రమంగానే వస్తుండటంతో తాను అసలు గర్భం దాల్చినట్లు గుర్తించలేకపోయింది. ఆ క్రమంలోనే తనకు కడుపులో, వెన్నులో నొప్పి రావడంతో కిడ్నీ నొప్పి అయ్యి ఉంటుందని తనకు తానే నిర్ధారించుకొని ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం తెలిసిందే.
బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, తొమ్మిది నెలల తన బిడ్డ ఆరోగ్యమంతంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి తీసుకోలేకపోయానని ఆమె దిగులుపడుతోందట. ఆమె భర్త మైఖెల్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మొన్నటి వరకు ఐదుగురం ఉండేవారిమని ఇప్పుడు ఆరుగురం అయ్యామని, సాధారణంగా తమకు బిడ్డపుడుతున్నాడనే ఫీలింగ్ తొమ్మిది నెలలుగా ఉంటే మాకు ఆ ఫీలింగ్ కేవలం అరగంట మాత్రమే దొరికిందని చెప్పాడు. వైద్యులు మాత్రం ఇలా జరగడం అత్యంత అరుదు అని అంటున్నారు.