కాల్పుల్లో గాయపడ్డ పౌరుణ్ని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు
- కొలరాడో స్ప్రింగ్స్ లోని ఆసుపత్రిలో సాయుధుడి కలకలం
- పోలీసు సహా ముగ్గురి మృతి, 10 మందికి గాయాలు.. దుండగుడి పట్టివేత
కొలరాడో స్ప్రింగ్స్: అమెరికా మరోసారి తుపాకి చప్పుళ్లతో దద్దరిల్లింది. కొలరాడో రాష్ట్రం, కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలోకి ప్రవేశించిన సాయుధుడు.. పలువురిపై కాల్పులు జరిపి, మరొకొందరిని బందీలుగా పట్టుకున్నాడు. శనివారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఉదయం 11:45కు) ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుడికి, పోలీసులకు మధ్య కూడా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి సహా ముగ్గురు చనిపోగా, మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు.
ఆసుపత్రి లోపల నక్కిఉన్న దుండగుడి వద్ద భారీ ఎత్తున గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. బందీగా లోపలే ఉండిపోయిన ఓ మహిళ.. తన బంధువులకు ఫోన్ చేసి ఇద్దరు సాయుధులు ఉన్నట్లు చెప్పింది. అధికారుల ద్వారా కాల్పుల ఘటన వివరాలను తెలుసుకున్న అధ్యక్షుడు బరాక్ ఒబామా.. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆపరేషన్ నిర్వాహించాల్సిందిగా ఆదేశించారు. దాదాపు మూడు గంటల ఉత్కంఠ అనంతరం పోలీసులు.. దుండగుణ్ని పట్టుకోగలిగారు. గాయపడ్డ 11 మందికి ప్రాణాపాయం లేదని కొలరాడో స్ప్రింగ్స్ మేయర్ జాన్ షతెర్స్ చెప్పారు. ఐదు రోజుల కిందట న్యూ ఆర్లియాన్స్ ప్రాంతంలోని ఓ పార్క్ లో ఇరు వర్గాలకు మధ్య చోటుచేసుకున్న కాల్పుల్లో 10 మరణించిన సంగతి తెలిసిందే.