
హిట్లర్ సంతకం@17వేల పౌండ్లు
లండన్:
తొలిపేజీలో హిట్లర్ సంతకం చేసిన ఓ పుస్తకం వేలంలో 17,000 పౌండ్ల ధర పలికింది. ఈ పుస్తకాన్ని చాలా అరుదైన పుస్తకమని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ఎందుకంటే తన సంతకం విషయంలో ఈ జర్మన్ నియంత చాలా కఠినంగా వ్యవహరించేవాడట. ఎప్పుడో ఒకసారి మాత్రమే సంతకం చేసేవాడట. హిట్లర్ జీవితచరిత్ర ఆధారంగా రాసిన ఈ పుస్తకం తొలిపేజీలో హిట్లర్ సంతకం చేయడమనేది అరుదైన విషయమేనని, అందుకే దీనికి భారీ ధర పలికిందని నిర్వాహకులు తెలిపారు.
ఇంగ్లిష్ రచయిత పీటర్ క్యాడోగన్ 1930లో హిట్లర్‌ను కలిసిన సందర్భంగా తాను రాసిన పుస్తకంపై జర్మనీ అధినేత నుంచి సంతకం తీసుకున్నాడు. పుస్తకం తొలి పేజీపై హిట్లర్ సంతకం చేసిన ఈ పుస్తకం 1935లో బయటకు వచ్చింది.