స్లొవేకియాలోని స్మార్ట్ డోమ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రకృతి ఒడిలో నిర్మించిన చిన్న చిన్న ఇళ్లు
ఫొటోలు చూశారుగా.... బుల్లి బుల్లి ఇళ్లు ఎంత అందంగా ఉన్నాయో.... వాటి చుట్టూ ఉన్న పరిసరాలూ అంతే అద్భుతంగా ఉన్నాయి. చిత్రమైన విషయమేమిటంటే... ఆ అద్భుతమైన ప్రకృతి అందాలను ఎంచక్కా ఆస్వాదించేందుకు ఈ ఇళ్లు సూట్ అవుతాయి అంటోంది స్లొవేకియాలోని స్మార్ట్‌డోమ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ. అవసరమైనప్పుడు... అవసరమైన చోట వీటిని అతితక్కువ సమయంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఫొటోలో చూపినట్టుగా నీటిపై, మంచు ఉన్న చోట, పచ్చటి అడవుల్లో ఏర్పాటు చేసుకునేందుకు వేర్వేరు డోమ్‌లను తయారు చేసింది ఈ కంపెనీ.
ట్రీ డోమ్‌లో పైకప్పుపై కాయగూరలు, పూల మొక్కలు పెంచుకోవచ్చు. స్నో డోమ్ బయటి వాతావరణం నుంచి మిమ్మల్ని రక్షించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లతో వస్తుంది. దాదాపు 150 మిల్లీమీటర్ల మందమైన ప్రత్యేకమైన ఇన్సులేషన్ కారణంగా ఇందులో విద్యుత్తు వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. పైకప్పు పారదర్శకంగా, అలా లేకుండా కూడా లభిస్తాయి ఈ డోమ్‌లు. రెండు, మూడు డోమ్‌లను కలిపి పెద్ద ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడమూ సులువే.
ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి క్యాంపులు ఏర్పాటు చేసుకునే బాదరబందీ లేకుండా చేసేందుకు ఈ డోమ్‌లు ఉపయోగపడతాయని అంటోంది స్మార్ట్‌డోమ్. ఆల్ప్‌స్ పర్వతాల్లో ఉన్న స్కీ విలేజ్, న్యూజీలాండ్‌లోని హోబిట్ విలేజ్‌ల మాదిరి ప్రకృతిలో ఒదిగిపోయే చిన్న చిన్న గ్రామాల్లాంటి వాటిని సిద్ధం చేయడం ఈ కంపెనీ లక్ష్యమట. ఒక్కో డోమ్ ఖరీదెంతో త్వరలోనే ప్రకటిస్తారట.