స్మార్ట్ ఫోన్లతో జర జాగ్రత్త!
స్మార్ట ఫోన్లతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరిశోధకులు. స్మార్ట్ ఫోన్లకు అపరిమితమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుండటంతో జనం ప్రయాణాల్లో కూడా వాటిని వదలట్లేదు. దీంతో చికాకు, ఆత్రుత పెరుగే అవకాశం ఉందని తాజా అధ్యయనాల ద్వారా కనుగొన్నారు.
స్మార్ట్ ఫోన్లలో అత్యంత ఎక్కువగా ఇంటర్నెట్ వాడటం 'వెబ్ డిపెండెన్స్ యాంగ్జయిటీ'కి దారితీస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల మనుషుల్లో తెలియని చికాకు, ఆత్రుత పెరుగుతుందని, విషయాలను సునిశితంగా ఆలోచించే శక్తి కోల్పోయి, ఆగ్రహావేశాలకు లోనయ్యే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. యువకులు, విద్యావంతుల్లో ఎక్కువగా ఈ వెబ్ డిపెండెన్స్ సమస్య వస్తోందని తైవాన్ లోని టైచుంగ్ నేషనల్ చిన్-యి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు హుయి జెన్ యాంగ్ తెలిపారు. సాంకేతికత వాడకాన్ని బట్టి మన మనస్తత్వం మారే అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనాల్లో వివరించారు.
ఒక వ్యక్తి తన భద్రత కోసం మరొకరితో సన్నిహితంగా ఉండటంవల్ల పొందే మానసిక పరివర్తన సిద్ధాంతాన్ని పోలుస్తూ ఈ కొత్త పరిశోధనలకు ఉదాహరణగా జోడించారు. సదరు వ్యక్తి దగ్గరగా ఉన్నపుడు ప్రశాంతంగా ఉండటం, లేకపోతే ఆత్రుతకు లోనవ్వడం వంటి మానసిక పరివర్తనను పరిశోధకులు తమ అధ్యయనాల్లో వినియోగించారు. ఒకరికి ఒకరు దూరమైనప్పుడు కలిగే ఆత్రుత..స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ ల కు దూరమైనప్పుడు కూడా కలిగే అవకాశం ఉందని పరిశోధనకులు కనుగొన్నారు.