
మంచు కొండ... హైలెస్సో హైలెస్సా!
ఒకపక్క భూగోళం మండిపోతోంది... ధ్రువ ప్రాంతాల్లోని మంచు మొత్తం కరగిపోతోంది అని ప్రపంచం అల్లల్లాడుతోందా? దీన్ని ఎలా తట్టుకోవాలో తెలియక శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారా? ఎడారి దేశం దుబాయి దీంట్లోనూ ఓ అవకాశాన్ని వెతుక్కుంటోంది. ఎలాగూ అంటార్కిటికా ప్రాంతంలో భారీ సైజులో మంచుగడ్డలు విరిగిపడుతున్నాయి కదా. వాటిల్లో కొన్ని మేము తెచ్చేసుకుంటాం. ఎంచక్కా దుబాయి వద్ద వాటిని కరిగించి అమ్మేసుకుంటామని ఆలోచన చేస్తోంది దుబాయి నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ... ఇదంత ఈజీనా? అని ప్రశ్నించుకుంటే అసాధ్యమైతే కాదన్న సమాధానం వస్తుంది. కాకపోతే పర్యావరణవేత్తలు మొదలుకొని వివిధ దేశాల నుంచి వ్యతిరేకత మాత్రం ఖాయం. ఈ కంపెనీ ఎండీ అబ్దుల్లా సలేహీ ఐడియా ఏమిటంటే.. ఆస్ట్రేలియాకు దిగువన ఉన్న హార్ట్ ఐలాండ్‌కు భారీ సైజు నౌకలు పంపాలి.
ఇప్పటికే ఆ ప్రాంతంలో మంచుఖండం తాలూకూ భారీసైజు ముక్కలు అక్కడ తేలియాడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద నగరాల సైజులో ఉన్నవాటిని వదిలేసి.. కొంచెం చిన్న మంచుముక్కల చుట్టూ ఓ వల వేయడం.. నౌకకు కట్టేసి 9000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయి వరకూ లాక్కెళ్లడం. ఇదీ ప్లాన్. ఓ 2000 కోట్ల గ్యాలన్ల నీరున్న మంచుముక్కను ఇలా లాక్కు రావడం సాధ్యమేనని సలేహీ అంచనా. ఉత్తర ధ్రువం తాలూకా మంచును కరిగించి నార్వే ఇప్పటికే మంచి బిజినెస్ చేస్తోందని.. 750 మిల్లీలీటర్ల నీటికి రూ.6500 వసూలు చేస్తోందని, తామూ ఇలాంటి బిజినెస్ ప్లాన్‌తో ముందుకెళతామని అంటున్నాడు సలేహీ! మంచుముక్కను దుబాయి వరకూ లాక్కుని వచ్చేందుకు అయ్యే ఖర్చు రూ.3 వేల కోట్లకు మించదు. మంచుముక్కలో అధికభాగం నీటి అడుగునే ఉండటం వల్ల అది కరిగిపోయేదీ తక్కువే. అయితే అంటార్కిటికా ప్రాంతంలో మైనింగ్, మిలటరీ కార్యకలాపాలపై అంతర్జాతీయంగా నిషేధం ఉండటం, ఆస్ట్రేలియా కూడా హార్ట్ ఐలాండ్ ప్రాంతంలోని ప్రకృతిని పరిరక్షించే లక్ష్యంతో నిషేధాజ్ఞలు అమలు చేస్తూండటం దుబాయి ప్లాన్‌కు అడ్డంకుల్లా కనిపిస్తున్నాయి. ఎలా అధిగమిస్తారో చూడాలి!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్