సో(లో)లార్ రికార్డు
ఏకధాటిగా 120 గంటల ప్రయాణం
హవాయి (అమెరికా): కేవలం సౌరవిద్యుత్‌తో నడిచే ‘సోలార్ ఇంపల్స్2’ విమానం చరిత్ర సృష్టించింది. జపాన్‌లోని నగోయా నుంచి సోమవారం బయలుదేరిన ఈ సౌర విమానం ఏకబిగిన 120 గంటలు... 7,900 కిలోమీటర్లు ప్రయాణించి శుక్రవారం రాత్రి పదిగంటలకు (భారత కాలమానం ప్రకారం) అమెరికాలోని హవాయి దీవులకు చేరుకుంది. నిరంతరాయం గా సుదీర్ఘసమయం ప్రయాణించిన రికార్డు ఇంతకుమునుపు స్టీవ్ ఫోసెట్ పేరిట ఉంది. ఆయన 2006లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన జెట్ విమానంలో 76 గంటల 45 నిమిషాలు ప్రయాణించారు.
అయితే సొలార్ ఇంపల్స్2 ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఒక్కచుక్క ఇంధనాన్ని కూడా వినియోగించదు. పూర్తిగా సౌరశక్తి పైనే ఆధారపడి నడుస్తుంది. ఈ విమానం బరువు 2,300 కిలోలు మాత్రమే. అయితే దీని రెక్కలు బోయిం గ్ విమానం కన్నా వెడల్పు. వీటిపై అమర్చిన 17,000 పైచిలుకు ఫలకాల ద్వారా ఇది సౌరశక్తిని గ్రహించి 4 లిథియం పాలిమర్ బ్యాటరీల్లో నిల్వచేస్తుంది. పగలు సౌరశక్తిని బాగా గ్రహిం చేందుకు 9,000 మీటర్ల ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లిన పెలైట్ అండ్రూ బోర్ష్‌బెర్గ్(స్విట్జర్లాండ్) రాత్రిపూట ఇంధనాన్ని ఆదా చేసేం దుకు 1,000 మీటర్ల ఎత్తులో ఎగిరేవాడు. దీని కాక్‌పిట్‌లో ఒక్కరే పడతారు. పెలైట్ సీటునే టాయిలెట్‌గానూ వాడుకొనేలా డిజైన్ చేశారు.
తిండి, నిద్ర అన్నీ ఆ కుర్చీలోనే. నిద్రపోవాలనుకుంటే సీటు కాస్త వెనక్కి వంచుకొని కునుకుతీయాలి. విమానాన్ని ఆటోపెలైట్ మోడ్‌లో పెట్టి... బోర్ష్‌బెర్గ్ 20 నిమిషాల చొప్పున నిద్రపోయేవాడు. ఇలా ఏకబిగిన 120 గంటలు ప్రయాణించాడు. మరో సహసమేమిటంటే... నగోయా నుంచి హవాయికి సొలార్ ఇంపల్స్2 యాత్ర మొత్తం పసిఫిక్ మహాసముద్రం మీదుగానే సాగింది. విమానం లో సాంకేతికలోపమొస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అవకాశం లేదు. పెలైట్ ప్యారాచూట్ సాయంతో సముద్రంలో దిగితే ప్రాణాలు నిలబెట్టుకోవడానికి చెక్కబల్ల (లైఫ్‌బోట్‌లాగా పనిచేస్తుంది) కాక్‌పిట్‌లో ఉంది. 35,000 కి.మీ. ప్రపంచయాత్రకు బయలుదేరిన ఈ విమానం ఈ ఏడాది మార్చి 10న అహ్మదాబాద్‌కు చేరుకోవడం తెలిసిందే.