ఇక 3డీ అద్దాల అవసరం లేదు!
న్యూయార్క్ః థియేటర్లలో 3డీ సినిమాలు చూడాలంటే తప్పనిసరిగా కళ్ళకు ప్రత్యేకమైన గ్లాసెస్ పెట్టుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇకపై అలాంటి అవసరం లేదంటున్నారు మసాచుసెట్స్.. వైజ్ మ్యాన్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు. కంటికి ఎలాంటి 3డీ గ్లాసెస్ పెట్టుకోకుండానే త్రీడీ సినిమాలు చూసే అవకాశం దగ్గరలోనే ఉందంటున్నారు.
అమెరికా కు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ లోని వైజ్ మ్యాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు 3డీ అద్దాలు పెట్టుకోకుండానే థియేటర్లలో 3డీ సినిమాలు చూడొచ్చని చెప్తున్నారు. 'సినిమా 3డీ' పేరున్న ఆప్టిక్ లెన్స్ ను స్ర్కీన్ పై అమర్చడంతో సినిమా హాల్లోని ఏ సీట్లో కూర్చున్నా.. 3డీ అనుభూతి కలుగుతుందని తమ తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఇప్పటికే గ్లాసెస్ లెస్ 3డీ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా... అది హాల్లో ఆటూ ఇటూ తిరిగుతూ చూసే అవకాశం ఉండదని, సీట్ల అమరిక ఆధారంగా సింగిల్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించారని ఎంఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ అర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్ కు చెందిన ప్రొఫెసర్ వోసియెక్ మాటుసిక్ అంటున్నారు. అయితే కొత్త సినిమా 3డీ స్పెషల్ ఆప్టిక్ సిస్టమ్ లో థియేటర్లోని ఏ ప్రాంతంనుంచీ, ఏ యాంగిల్ లోనైనా 3డీ సినిమాను అద్దాల్లేకుండా చూడొచ్చని చెప్తున్నారు.
ప్రస్తుతం ఈ కొత్త గ్లాసెస్ లెస్ 3డీ సిస్టమ్ అభివృద్ధి దశలో ఉందని, థియేటర్లలో ఈ కొత్త విధానం అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. కాలిఫోర్నియాలోని అనాహైమ్ లో జరిగబోయే 'సిగ్ గ్రాఫ్' కంప్యూటర్ గ్రాఫిక్స్ కాన్ఫరెన్స్ లో తాము అభివృద్ధి చేసిన పరిశోధనలను ప్రవేశపెట్టనున్నట్లు వారు తెలిపారు.