పీటర్‌మారిట్జ్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో రైలు నుంచి గెంటివేతకు గురైన తరువాత మహాత్మా గాంధీ ప్రారంభించిన సత్యాగ్రహ ఉద్యమానికి 125 ఏళ్లు నిండుతున్న సందర్భంగా మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ‘మేకింగ్ ఆఫ్ మహాత్మ’ చిత్రాన్ని ప్రదర్శించారు. దక్షిణాఫ్రికాలో లాయర్‌గా పనిచేస్తున్న సమయంలో గాంధీ 1893, జూన్ 7న శ్వేతజాతీయులకు కేటాయించిన సీటును ఖాళీ చేయడానికి నిరాకరించడంతో పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో ఆయన్ని బలవంతంగా దించేశారు.
ఈ ఘటన ప్రభావంతో దక్షిణాఫ్రికా, భారత్‌లో బ్రిటిష్ విధానాలను శాంతియుతంగా ఎదుర్కొనేందుకు, ప్రజలను సంఘటితపరచడానికి గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాలను రూపొందించారు. 1996లో శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన ‘మేకింగ్ ఆఫ్ మహాత్మ’ చిత్రాన్ని భారత్, దక్షిణాఫ్రికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రాపంచిక వ్యవహారాలను వదులుకుని డర్బన్‌లో ఫీనిక్స్, జోహెన్నెస్‌బర్గ్‌లో టాల్‌స్టాయ్ ఫార్మ్‌ను నిర్మించాలని గాంధీ నిర్ణయించుకున్న తరువాత జరిగిన పరిణామాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రాన్ని ప్రదర్శించిన అవలాన్ గ్రూప్ సినీ సెంటర్ సీఈఓ ఏబీ మూసా స్పందిస్తూ..తన పూర్వీకులకు గాంధీతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటే ఎంతో ఉద్వేగం కలుగుతోందని అన్నారు. తదుపరి రెండు రోజులపాటు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment