మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
రెండేళ్ల క్రితం మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియాలను గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ వజృంభిస్తోంది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్- మెర్స్)గా పిలిచే కరోనా వైరస్ బారిన పడి దక్షిణ కొరియాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
తీవ్ర అనారోగ్యానికి గురైన 58 ఏళ్ల మహిళను ఆసుపత్రిలో చేర్చగా సోమవారం ఆమె మరణించింది. వైద్యపరీక్షల అనంతరం కరోనా వైరస్ వల్లే ఆమె చినిపోయిందని, మంగళవారం మృతిచెందిన 71 ఏళ్ల వృద్ధుడు కూడా ఆ మహమ్మారి వల్లే చనిపోయాడని దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 25 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించామని, ప్రస్తుతం రోగులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది.
2012లో సౌదీ అరేబియాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ బారినపడి మధ్యప్రాచ్య దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదకారి కరోనా...
కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదిగా వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అరవై ఏళ్లు దాటిన వారికీ, మహిళలకూ ఎక్కువగా సోకే అవకాశం ఉందన్నారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే నియంత్రించడం సాధ్యమేనని వైద్యాధికారులు చెప్పారు.
కరోనా వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయి..
స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలను పోలి ఉంటుంది వైరస్ సోకిన రెండ్రోజుల్లోనే తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, దగ్గు తీవ్రత పెరుగి ఊపిరితిత్తుల సమస్యలు మొదలవుతాయి. విపరీతమైన ఆయాసంతో గాలి తీసుకోలేని పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత న్యుమోనియాకు దారితీసే అవకాశమూ ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరిగితే మూత్రపిండాలకూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.