ప్రధాని ముఖంపై పంచ్ విసిరాడు
మాడ్రిడ్: ఓ యువకుడు ఏకంగా ప్రధానమంత్రిపై దాడిచేసి ఆయన ముఖంపై పంచ్ విసిరాడు. అంతటితో ఆగకుండా ప్రధాని కళ్లద్దాలను విరగొట్టేశాడు. ఈ ఘటన స్పెయిన్ లోని పాంటేవేద్రాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... స్పెయిన్ ప్రధాని మరియానో రాజోయ్ పెంటేవేద్రా అనే పట్టణంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆండ్రీస్ డెల్ వీ అనే ఓ యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి అన్నట్లుగా ప్రధాని దగ్గరికి వచ్చాడు. కుడి చేతిలో ముబైల్ పట్టుకుని సెల్ఫీ కోసం ప్రధానికి దగ్గరికి వచ్చాక, ఆ యువకుడు తన ఎడమ చేతితో ప్రధాని రాజోయ్ ముఖంపై ఓ పంచ్ విసిరాడు. ప్రధానిపై దాడికి పాల్పడటంతో పాటు ఆయన కళ్లద్దాలను విరగొట్టాడు. ఊహించని ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.
ప్రధానిని ఓ అధికారి కారులో అక్కడి నుంచి లా కరునా నగరానికి తీసుకెళ్లారు. ఈ అనూహ్య సంఘటనకు పార్టీ మంత్రులు, నేతలు షాక్ తిన్నారు. ఆ యువకుడు ప్రధానిని కొట్టడంపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు, మాటలు రావట్లేదని పబ్లిక్ వర్క్స్ మంత్రి అనా పాస్టర్ అన్నారు. స్పానిష్ సోషలిస్ట్ పార్టీ నేతలందరి తరఫున ప్రధాని రాజోయ్కు ఆ పార్టీ నేత పెడ్రో సాంచెజ్ తన సంఘీభావాన్ని తెలిపారు. అరెస్టు చేసిన యువకుడిని పోలీసులు ప్రశ్నించగా.. ప్రధానిని కొట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆ యువకుడు సమాధానమివ్వడంతో వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. తదుపరి విచారణ కొనసాగుతుంది.