ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు : ఏటీఎం మెషిన్‌లో సైబర్ డివైజ్‌ను అమర్చి లక్షలాది రూపాయలు నగదు డ్రా చేసే విదేశీ సైబర్ దొంగల గ్యాంగ్ ఐటీ సిటీలో ప్రవేశించింది. బ్యాంకు అధికారులకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. ఏటీఎం మెషిన్ పాస్‌వర్డ్‌ను దొంగిలించి క్రెడిట్, డెబిట్‌కార్డ్స్ డేటా తస్కరించి ఏటీఎం కేంద్రాల్లో నగదు దోచేస్తున్నారు.
రూ.17 లక్షలు డ్రా
జనవరి 10వ తేదీన డాక్టర్ శివరామకారంతనగర ఎస్‌బీఐ శాఖ ఏటీఎంలో పరికరం అమర్చి రూ.17.71 లక్షల నగదు డ్రాచేశారు. ఈ కేసులో స్పెయిన్ దేశానికి చెందిన సేపీ అనే మహిళను సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. విచారణలో ఈమె నుంచి ఎంతో ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొరియా నుంచి ఒక పరికరాన్ని తెప్పించి ఏటీఎంకు అనుసంధానం చేస్తారు. దాని ద్వారా ఏటీఎంలో ఉన్న నగదును ఎంతైనా డ్రా చేసుకోవచ్చునని చెప్పింది. ఆమెకు సహకరించిన ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఏ అకౌంటో తెలియదు
కొడిగేహళ్లి ఎస్‌బీఐ ఏటీఎం మెషిన్లో ఫిబ్రవరి 10, 11 తేదీల్లో 14 సార్లు రూ.10 వేల మేర మొత్తం రూ.1.40 లక్షల నగదు డ్రా చేశారు. ఏ బ్యాంక్ అకౌంట్‌దారు ఈ నగదును తీశారనేది రికార్డులో నమోదు కాలేదని ఎస్‌బీఐ అధికారులు వైట్‌ఫీల్డ్ సీఇఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, సంపిగేహళ్లి పోలీసులు స్పెయిన్ యువతి నుంచి రూ.17 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. ఈమె అనుచరుల ఆచూకీ ఇంకా కనిపెట్టలేదు.
రూ.78 లక్షలు డ్రా
రాజాజీనగర పారిశ్రామికవాడ ప్రాంతంలోని ఏటీఎంలో 2020 నవంబరు నుంచి 2021 జనవరి 30 వరకు గుర్తుతెలియని వ్యక్తులు రూ.78 లక్షలు డ్రాచేశారు. ఏ అకౌంట్ నుంచి నగదు డ్రా చేశారనేది తెలియరాలేదు. బ్యాంకు అధికారులు ఎంత తనిఖీ చేసినా క్లూ దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment