
వాషింగ్టన్ : లూలును సీఐఏ విధుల నుంచి తప్పించింది. లూలు అంటే బాంబు స్క్వాడ్ బృందంలో పనిచేసే ఓ శునకం. లూలును ఎందుకు జాబ్ నుంచి తీసేశారో ఆ వివరాలపై ఓ లుక్కేయండి.. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబు తనిఖీల కోసం కొన్ని ప్రత్యేక జాతి శునకాలకు శిక్షణ ఇస్తాయి. ఇందులో భాగంగానే ఇటీవల లాబ్రడార్ బ్రీడ్‌కు చెందిన లూలును ఎంపిక చేసింది సీఐఏ.
బాంబులుగానీ, లేదా ఇతర పేలుడు, అనుమానిత వస్తువులను పసిగట్టేలా అధికారులు లూలుకు శిక్షణ ఇప్పించారు. అయితే గతకొన్ని రోజులుగా లూలు విధులు సరిగా నిర్వహించడం లేదని గుర్తించారు. ఆ వివరాలను సీఐఏ ఓ బ్లాగులో పేర్కొంది. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కొన్ని శునకాలు తమ విధులు సక్రమంగా నిర్వర్తించవు. అందుకు లక్ష కారణాలుండొచ్చు. కొన్నిసార్లు కొన్నిరోజులకే అవి మళ్లీ పూర్తిస్థాయిలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తాయి.
లూలు విషయంలో అలా జరగదని తేలిపోయింది. మళ్లీ శిక్షణ ఇవ్వాలని చూసినప్పటికీ, ఆ శునకం ఆసక్తి చూపించడం లేదట. ఒకవేళ బలవంతంగా లూలుతో పని చేయిస్తే అది బాంబులు, పేలుడు పదార్థాలను గుర్తించకపోతే ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉంది. దాంతో పాటు లూలు సాధారణ శునకాల్లాగ జీవించాలని చూస్తుందని, అందుకే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని తెలుసుకున్న అధికారులు ఈ స్పెషల్ డాగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఉద్యోగం పోగొట్టుకున్న లూలు ప్రస్తుతం హ్యార్రీ అనే మరో శునకంతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ సాధారణ జీవితం గడుపుతోందని అధికారులు ఆ బ్లాగ్‌లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment