కొలంబో: వరుస ఆత్మాహుతి బాంబు దాడులతో విలవిల్లాడుతున్న శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేయడానికి నిరాకరించిన పోలీసు బాస్‌పై వేటు వేసింది. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయసుందరను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు చేసింది. ఉగ్రదాడిపై నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించారన్న ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేసినట్టు సోమవారం ప్రకటించారు. అలాగే డీఐజీ చందన విక్రమ రత్నేను యాక్టింగ్ పోలీస్ ఛీప్‌గా నియమిస్తూ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరోపణలను ఖండించిన పుజిత్ రాజీనామా చేసినప్పటికీ, సంబంధిత పత్రాలను అధికారికంగా సమర్పించకపోవడంతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ చర్య తీసుకున్నారు. మరోవైపు మిలిటరీ దుస్తులు ధరించిన వ్యక్తులు మరిన్నిభీకర దాడులకు పాల్పడవచ్చని, అప్రమత్తంగా ఉండాలంటూ శ్రీలంక భద్రతా వర్గాలకు , నిఘా విభాగం తాజాగా హెచ్చరికలు జారీచేసింది.
దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ముసుగు వేసుకుని సంచరించడాన్ని నిషేధించింది.ఈ మేరకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం ఆదేశాలు జారీచేశారు. దేశంలోని ఉంటున్నవారు తమ ముఖాన్ని ఇతరులు గుర్తు పట్టకుండా ఉండేట్లు ఎలాంటి ముసుగు ధరించకూడదని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అటు ముఖాన్ని కప్పుతూ ఉండేలా దుస్తులు ధరించవద్దని ఇటీవల శ్రీలంకలోని ఓ ముస్లిం సంస్థ కూడా సూచించింది.
ముఖానికి ఎవరూ ఎటువంటి ముసుగూ ధరించరాదని శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈస్టర్ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన స్పష్టం చేశారు. సైనిక బలగాలకు తనిఖీకి అనుగుణంగా, నింధితులను గుర్తించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే శ్రీలంకకు వస్తున్న భారతీయులు అవసరమైన చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
కాగా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. దేశంలో సోమవారంనుంచి అత్యయిక పరిస్థితి చట్టాన్ని వినియోగిస్తూ పలు నిబంధనలను విధిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment