కొలంబో: భారత్కు చెందిన 126 మంది జాలర్లను శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. తమ సముద్రజలాల్లో చేపలు వేటాడుతున్నారనే నెపంతో శ్రీలంక నేవి అధికారులు వీరిని గతంలో అరెస్ట్ చేశారు. అయితే గత కొంత కాలంగా భారత్, శ్రీలంక అధికారుల మధ్య జాలర్ల విడుదలకు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో నేడు శ్రీలంక ప్రభుత్వం జాలర్లను భారత్కు అప్పగించింది. వీరిలో 78 మంది జాలర్లను కన్కేసంతురాయ్ తీరం వద్ద 'సాగర్' నౌకా సిబ్బందికి అప్పగించగా, మిగిలిన వారిని 'రాజ్ కమల్' నౌకా విభాగానికి అప్పగించినట్లు శ్రీలంక నావీ స్పోక్స్ పర్సన్ అక్రమ్ అలవి వెల్లడించారు.
ఇటీవలి కాలంలో భారత్, శ్రీలంక దేశాల మధ్య మత్స్యకారుల విడుదల విషయం ద్వైపాక్షిక సంబంధాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంక పర్యటన సందర్భంగా కూడా మత్స్యకారుల అంశం చర్చకు వచ్చింది. అలాగే భారత జాలర్లపై విధించిన భారీ జరిమానాలపై కూడా పునరాలోచించనున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.