నోబెల్ నామినీల్లో శ్రీశ్రీ రవిశంకర్?
బెంగుళూరు: ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి ఈసారి భారతీయులకు వరించనుందా అంటే అవునని ఊహాగానాలు వస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఈ అవార్డుకు భారత్ నుంచి అర్హుడని, ఈ ఏడాది నామినీల్లో ఆయన పేరు ఉండనుందని థామ్సన్ రాయిటర్స్ సంస్థ పేర్కొంది. కొలంబియాలో శాంతి స్థాపనకు ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడింది. అయితే, దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి తెలిపారు.
కొలంబియాలో శాంతిని నెలకొల్పేందుకు 2012 నుంచి ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రవిశంకర్ శాంతి సేవలకుగాను దేశ అత్యున్నత పౌరపురస్కారంతో ఆ ప్రభుత్వం సత్కరించింది. 2015లో క్యూబాలో పర్యటించినపుడు చర్చల ద్వారా కొలంబియా తిరుగుబాటు దళాల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఆయన కృషి చేశారు. మొత్తం 150 దేశాల్లో ఆయన సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆయన సేవలను గుర్తించి జనవరిలో భారతప్రభుత్వం ఇప్పటికే దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ను కూడా అందించిన విషయం తెలిసిందే.