noble
-
నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది?
కాటలిన్ కారికో, డ్రూ వీస్మాన్ ఈసారి ఫిజియాలజీ, మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను ఈ ఇద్దరు విజేతలకు ఈ అవార్డు లభించింది. వీరి ఆవిష్కరణలు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా, మరింత సమర్థవంతంగా పనిచేసే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధికి గణనీయంగా సహకరించాయి. ఈ విజేతలకు నోబెల్ ప్రైజ్‌తో పాటు ప్రైజ్ మనీగా ఎంత మొత్తంలో నగదు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నోబెల్ బహుమతి విజేతలు ఈ బహుమతితో పాటు అనేక ఇతర కానుకలు అందుకుంటారు. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ బహుమతి కింద వారికి ఊహకందనంత నగదు వారికి లభిస్తుంది. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా వీరికి అత్యంత ఆదరణ లభిస్తుంది. ఈసారి నోబెల్ బహుమతి పొందిన వారందరికీ 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్ అందించారు. డాలర్లలో చూస్తే దాదాపు 9.86 డాలర్లు. భారతీయ రూపాయిలలో చూస్తే 8 కోట్ల రూపాయలకంటే అధికం. నోబెల్ విజేతలకు డబ్బుతో పాటు బంగారు పతకాన్ని, సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు. 2020 సంవత్సరంలో ఈ మొత్తం ఒక కోటి స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2017వ సంవత్సరంలో ఇది 90 లక్షల స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2012లో నోబెల్ విజేతలకు 80 లక్షల స్వీడిష్ క్రోనార్లను అందించారు. దీని ప్రకారం చూస్తే కాలక్రమేణా బహుమతిగా వచ్చే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. 1901లో మొదటిసారి నోబెల్ బహుమతిని అందించినప్పుడు, ఒక్కో కేటగిరీ ప్రైజ్ మనీ 150,782 స్వీడిష్ క్రోనార్‌గా ఉండేది. అంటే ఆ మొత్తాన్ని ప్రస్తుత భారతీయ రూపాయల్లోకి మారిస్తే రూ.11 లక్షలకు పైగానే ఉంటుంది. అంటే తొలిసారి నోబెల్ బహుమతి మొత్తం రూ. 11 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ. 8 కోట్లకు పెరిగింది. ఇది కూడా చదవండి: ప్రపంచ అందగత్తెల వ్యాలీ ఎక్కడుంది? వారి దీర్ఘాయువు సీక్రెట్ ఏమిటి? -
గురుత్వ ప్రయోగాల వెనుక మనోళ్లు!
న్యూఢిల్లీ: గురుత్వ తరంగాలను గుర్తించినందుకుగాను ఖగోళ భౌతిక శాస్త్రంలో ముగ్గురు అమెరికన్లకు నోబెల్ వరించింది. అయితే ఈ ఘనత సాధిం చడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి కూడా ఎంతో ఉంది. గురుత్వ తరంగాలను గుర్తించేం దుకు చేసిన ప్రయోగాలకు నోబెల్ లభించడంతో కల నెరవేరినట్లయిందని బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ బాలా అయ్యర్ పేర్కొన్నారు. గురుత్వ తరంగాలను గుర్తించేందుకు అధునాతనమైన ప్రయోగాలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘ఇండిగో’ ప్రోగ్రాంలో బాలా అయ్యర్ సాంకేతికంగా సాయమందించారు. గురుత్వ తరంగాలను గుర్తించడం ద్వారా కొత్త తరం శాస్త్రవేత్తలు ఖగోళ పరిశోధనలపై దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న, ఐఐఎస్ఈఆర్– కోల్‌కతాకు చెందిన రాజేశ్ నాయక్ పేర్కొన్నారు. ఈ ప్రయోగాల్లో పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన సంజీవ్ దురంధర్ కూడా పాలుపంచుకున్నారు. -
6 శాతం వృద్ధి రేటు నిరాశాజనకం
♦ నోట్ల రద్దు, ఆర్బీఐ కఠిన పాలసీ, బలమైన రూపాయే తక్కువ వృద్ధికి కారణాలు ♦ ‘నోబెల్’ ఆర్థికవేత్త పాల్క్రుగ్మన్ ముంబై: భారత్ వంటి దేశానికి 6 శాతం వృద్ధి రేటు నిరాశ కలిగించే విషయమని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత పాల్క్రుగ్మన్ అన్నారు. మోదీ సర్కారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, ఆర్బీఐ కఠిన విధానం, బలమైన రూపాయి ఇవే వృద్ధి నిదానంగా ఉండడానికి కారణాలుగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అధిక సంఖ్యలో పనిచేసే శ్రామిక శక్తిని కలిగి ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ ఆ మేర ఫలితాలను చూపించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. 6% వృద్ధి రేటు నిరాశపరిచిందని, కనీసం 8–9% అయినా నమోదు చేయాల్సి ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.1%గా నమోదవడం తెలిసిందే. అబివృద్ధి చెందిన దేశాల మాదిరిగా కాకుండా భారత్‌ను సంప్రదాయ స్థూల ఆర్థిక అంశాలు బాధిస్తున్నాయన్నారు. అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే, ఆర్బీఐ కఠిన విధానాన్ని కొనసాగించడం, బలమైన రూపాయి ఎగుమతుల్లో పోటీ పడలేకుండా చేశాయన్నారు. ఆర్బీఐ విధానాన్ని ఎందుకు సరళతరం చేయలేదో తనకు అర్థం కాలేదని ఆయన పేర్కొన్నారు. -
ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్...
క్రీడాకారులకు ఏపీ సీఎం ఆఫర్ ♦ చంద్రబాబు ప్రకటనపై సోషల్ మీడియాలో జోకులు ♦ ఒలింపిక్స్‌కు, నోబెల్‌కు ముడిపెట్టడంపై విస్మయం ♦ ప్రతిష్టాత్మక పురస్కారాన్నితానే ఇస్తాననడంపై ఆశ్చర్యం ♦ విజయవాడలో షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు సన్మానం..గ్రూపు–1 ఉద్యోగం ఇస్తామన్న బాబు విజయవాడ స్పోర్ట్స్ ‘‘మన పిల్లలు ఒలింపిక్ క్రీడల్లో గెలవాలి. విజయం సాధించే వరకూ గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో వస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని ఇటీవలే నేను అనౌన్స్ కూడా చేశాను. ఒలింపిక్స్‌లో గెలిచిన తర్వాత నీకు(కిడాంబి శ్రీకాంత్) ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానం చేయాలని నా ఆశ, నా ఆశయం. తప్పకుండా సాధించి తీరాలని కోరుతున్నా’’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ సన్మాన సభలో చంద్రబాబు ఇచ్చిన ఈ ఆఫర్ అందరినీ విస్మయానికి గురిచేసింది. ఒలింపిక్ క్రీడలకు, నోబెల్ ప్రైజ్‌కు ముడిపెట్టిన ముఖ్యమంత్రి పరిజ్ఞానంపై సోషల్ మీడియాలో జోకులు బాగానే పేలుతున్నాయి. పైగా ఆ ప్రైజ్ తానే ఇస్తానని సీఎం చెప్పడం గమనార్హం. ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని ఎవరు పడితే వారు ఇచ్చుకుంటూ పోలేరు. విజేతలను నోబెల్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ పురస్కారాన్ని క్రీడాకారులకు ఇవ్వరు. ఇవేవీ పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు ఒలింపిక్స్‌లో గెలిచిన వారిని నోబెల్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చింది మాట్లాడడం ఏమిటోనని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేను స్థలం ఇవ్వడం వల్లే... ‘‘చదువుకుంటే కేవలం ఉద్యోగంతో జీవితంలో స్థిరపడతారు. అదే క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటే మంచి ఆరోగ్యంతోపాటు జీవితంలో స్థిరపడతారు. సమాజం, ప్రభుత్వాలు గుర్తిస్తాయి. ఇందుకు కిదాంబి శ్రీకాంతే మంచి ఉదాహరణ. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో మరింత మంది క్రీడాకారులు తయారు కావాలి’’ అని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడల్లో రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచస్థాయిలో చాటిచెప్పే వారికి నగదు పారితోషికం, గ్రూపు–1 ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుల్లెల గోపీచంద్‌కు అకాడమీ నిర్వహణకు స్థలం కేటాయించినందు వల్లే నేడు మెరికల్లాంటి పీవీ సింధు, శ్రీకాంత్, సైనాలు పుట్టుకొచ్చారని చెప్పారు. పుల్లెల గోపీచంద్‌కు రూ.15 లక్షలు ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన శ్రీకాంత్‌పై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కిదాంబి శ్రీకాంత్ సన్మాన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకాంత్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు కిదాంబి రాధాముకుందా, కృష్ణను సన్మానించారు. శ్రీకాంత్‌కు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. ఆయనకు గుంటూరులో 1,000 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. ప్రస్తుతం ఇండేన్ అయిల్ కార్పోరేషన్లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న శ్రీకాంత్‌కు ఇష్టమైతే, అది వదిలేసి వస్తే రాష్ట్రంలో గ్రూపు–1 ఆఫీసర్ పోస్టును ఇస్తామని తెలిపారు. శ్రీకాంత్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.15 లక్షల నజరానా ప్రకటించారు. చంద్రబాబుకు రాకెట్ బహుకరించిన శ్రీకాంత్ గోపీచంద్ అకాడమీ వల్లే తాను ఈ రోజు ఇంతటి స్థాయిలో ఉన్నానని కిడాంబి శ్రీకాంత్ అన్నారు. సీఎం చంద్రబాబు కృషి, కోచ్ గోపీచంద్ శ్రమతోనే అకాడమీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ విదేశాల నుంచి తెచ్చిన యోనెక్స్ కంపెనీ రాకెట్‌ను సీఎం చంద్రబాబుకు బహూకరించారు. అనంతరం వేదికపై సీఎం చంద్రబాబుతో కొద్దిసేపు సరదాగా బ్యాడ్మింటన్ ఆడి అలరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్ తల్లిదండ్రులు కృష్ణ, రాధాముకుందా, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నోబెల్ నామినీల్లో శ్రీశ్రీ రవిశంకర్?
బెంగుళూరు: ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి ఈసారి భారతీయులకు వరించనుందా అంటే అవునని ఊహాగానాలు వస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఈ అవార్డుకు భారత్ నుంచి అర్హుడని, ఈ ఏడాది నామినీల్లో ఆయన పేరు ఉండనుందని థామ్సన్ రాయిటర్స్ సంస్థ పేర్కొంది. కొలంబియాలో శాంతి స్థాపనకు ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడింది. అయితే, దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి తెలిపారు. కొలంబియాలో శాంతిని నెలకొల్పేందుకు 2012 నుంచి ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రవిశంకర్ శాంతి సేవలకుగాను దేశ అత్యున్నత పౌరపురస్కారంతో ఆ ప్రభుత్వం సత్కరించింది. 2015లో క్యూబాలో పర్యటించినపుడు చర్చల ద్వారా కొలంబియా తిరుగుబాటు దళాల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఆయన కృషి చేశారు. మొత్తం 150 దేశాల్లో ఆయన సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆయన సేవలను గుర్తించి జనవరిలో భారతప్రభుత్వం ఇప్పటికే దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ను కూడా అందించిన విషయం తెలిసిందే. -
నోబెల్ వేదికపై మెరిసిన భారత ఉపఖండం
సత్యార్థి, మలాలాకు శాంతి పురస్కారం నోబెల్ వేదికపై 2014లో భారత ఉపఖండం మెరిసింది. బాలల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న భారత్‌కు చెందిన కైలాశ్ సత్యార్థి(60), పాక్ బాలిక మలాలా యూసఫ్‌జాయ్(17) ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని సంయుక్తంగా స్వీకరించారు.ఓస్లొలో డిసెంబర్ 10న వైభవంగా జరిగిన నోబెల్ప్రదాన కార్యక్రమంలో 2014 సంవత్సరానికిగాను వారిరువురికి ఈ అవార్డ్‌ను అందించారు. కైలాశ్ తాను నిర్వహిస్తున్న ‘బచ్పన్ బచావో ఆందోళన్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా 80 వేలమంది బాలకార్మికులను రక్షించి పాఠశాలల్లో చేర్పించారు. బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమించినందుకు తాలిబాన్ ఉగ్రవాదులు మలాలాపై కాల్పులు జరిపారు. మలాలా తలకు తీవ్ర గాయమైనా జంకకుండా పిల్లల హక్కుల కోసం ఉద్యమిస్తోంది. -
సర్ రోనాల్డ్ రాస్ మన తొలి నోబెల్ స్టార్
ఆల్ఫ్రెడ్ నోబెల్... నోబెల్ పురస్కారాల ప్రదానం ప్రారంభించింది 1901లో. ఆ మరుసటి సంవత్సరం (1902లో) ఆ బహుమతిని అందుకున్న వ్యక్తి సర్ రోనాల్డ్ రాస్. ఇతడు నోబెల్ పురస్కారం అందుకున్న మొదటి భారతీయుడు (జన్మస్థలాన్ని బట్టి). ఇతడికి వైద్య శాస్త్రం శరీర ధర్మశాస్త్రం విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. మలేరియా వ్యాధిని నిర్మూలించడానికి రోనాల్డ్ రాస్ దోమల మీద చేసిన పరిశోధనలు, ఆయన జీవితవిశేషాలివి. రోనాల్డ్ రాస్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరాలో 1857వ సంవత్సరం మే నెల 13వ తేదీన జన్మించారు. ఇతడి తండ్రి సర్ సి.సి.జి.రాస్ ఉత్తరాఖండ్‌లో బ్రిటిష్ సైన్యంలో ‘జనరల్’గా (అత్యున్నత అధికారి) పనిచేసేవారు. ఆ రోజుల్లో భారతదేశంలోను, అనేక ఆసియా దేశాల్లోను మలేరియా వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తూండేది. అప్పట్లో అది ప్రాణాంతకమైన వ్యాధి కూడ. వైద్యుడైన రోనాల్డ్ రాస్ మలేరియా వ్యాధి గురించి విస్తృతమైన పరిశోధనలు చేశారు. ‘ఎనాఫిలస్’ జాతి దోమకాటు ద్వారా మలేరియా వ్యాధి సోకుతుందని, దోమల శరీరంలో ఉండే మలేరియా పరాన్నభక్కులు (parasites) దోమకాటు ద్వారా మానవ రక్తంలో ప్రవేశిస్తాయని తెలుసుకున్నారీయన. మలేరియాని మన రాష్ట్రంలో చలిజ్వరం అంటారు. దోమల నిర్మూలన ద్వారా ఈ వ్యాధిని నిరోధించవచ్చని రాస్ కనుగొన్నాడు. ‘ట్రోపికల్ మెడిసిన్’ విభాగాన్ని నెలకొల్పిన సర్ రోనాల్డ్ రాస్ వైద్య పరిశోధనా రంగంలో ఉన్న వారికి ఆదర్శనీయుడు. సర్ రోనాల్డ్ రాస్ జీవిత విశేషాలు సర్ రోనాల్డ్ రాస్... బ్రిటిష్ సైనికాధికారి జనరల్ (సర్) క్యాంప్‌బెల్ క్లే గ్రాంట్రాస్ (టజీట ఇఇఎ ఖౌటట), మటీల్డా చార్లొట్ ఎల్డకటన్ దంపతులకు ప్రథమ సంతానం. బ్రిటిష్ జాతీయుడైనప్పటికీ భారతదేశంలో జన్మించటం చేత, రోనాల్డ్‌కు భారతదేశమంటే ఎనలేని ప్రేమ, గౌరవం. రోనాల్డ్ రాస్ తాతగారైన లెఫ్టినెంట్ కల్నల్ హ్యూరాస్కు మలేరియా జ్వరం సోకింది. అది మొదలు రోనాల్డ్‌కు వైద్య విద్యనభ్యసించి మలేరియా వ్యాధిపై పరిశోధన చేయాలని, ఆ వ్యాధిని నిర్మూలించే మార్గం కనుగొనాలనే బలమైన కోరిక మనసులో నాటుకుంది. తాను ఆశించిన విధంగానే పాఠశాల విద్య అనంతరం తన 18వ యేట లండన్ వైద్య కళాశాలలో చేరి, 1880లో వైద్య పట్టా పొందారు. వెంటనే రాస్ భారతదేశానికి తిరిగివచ్చి, 1881వ సంవత్సరంలో ఇండియన్ మెడికల్ సర్వీస్‌లో చేరి, మలేరియా వ్యాధిపై పరిశోధనలు ప్రారంభించారు. రోనాల్డ్ రాస్ 1892వ సంవత్సరం వరకూ జరిపిన పరిశోధనలు ఫలంతమయ్యాయి. మలేరియా వ్యాధి ‘ఎనాఫిలస్’ (అ్చఞజిడఠట) జాతి దోమల ద్వారా సంక్రమిస్తుందని, దోమల రక్తనాళాలలోని పరాన్నభక్కులు (ఞ్చట్చటజ్ట్ఛీట) మనిషి రక్తంలో ప్రవేశించి, మలేరియా వ్యాధిని కలగజేస్తాయని నిర్ధారించారు. ఎనాఫిలస్ దోమల నిర్మూలన ద్వారా మలేరియా వ్యాధిని నివారించవచ్చని కనుగొన్నారు. రోనాల్డ్ తన పరిశోధనలను అంతటితో ఆపలేదు. మరింత లోతుగా అధ్యయనం చేయడానికి 1899లో ఇంగ్లండుకు వెళ్లి లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌లో చేరాడు. ఆఫ్రికా దేశంలో విస్తారంగా ఉన్న మలేరియా, ఆఫ్రికన్ జ్వరాలపై పరిశోధనలు జరిపి, ఆయా వ్యాధుల నివారణకు మార్గాలు సుగమం చేశాడు. 1901వ సంవత్సరంలో డాక్టర్ రాస్ ఊఖఇ (ఫెలోఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ సర్జన్స్), ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (ఊఖ) బిరుదులు పొందారు. రాస్... ప్రతిష్ఠాత్మకమైన రాయల్ సొసైటీకి ఉపాధ్యక్షునిగా కూడా ఎంపికయ్యారు. ఇంగ్లండులో అనేక ప్రతిష్టాత్మకమైన పదువులు చేపట్టి, వైద్యునిగా, బాక్టీరియాలజీ (సూక్ష్మజీవుల శాస్త్రం) విభాగాలలో పరిశోధనల ద్వారా కీర్తి గడించి అటు ఇంగ్లండులోను, ఇటు ఆసియా, ఆఫ్రికా దేశాలలోనూ ప్రసిద్ధి పొందారు. రోనాల్డ్ రాస్ ప్రపంచానికి శాస్త్రవేత్తగానే పరిచయమయ్యారు. కానీ ఆయన మంచి రచయిత కూడ. తీరిక వేళల్లో రచనలు చేసేవారు. కవి, నాటక కర్త, రచయితగా పేరుతెచ్చుకున్నారు. ఆయన రచనలలో ‘స్వీయ చరిత్ర’, ‘మలేరియా వ్యాధి నిరోధం’ ప్రధానమైనవి. 1889లో రోనాల్డ్ జెస్సీ బ్లాక్సమ్ అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు. వారికి నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు... డరోతీ రాస్, సిల్వియా రాస్. ఇద్దరు కొడుకుల పేర్లు... రోనాల్డ్ రాస్, చార్లెస్రాస్. తన జీవితం అంతా వైద్యసేవకు, పరిశోధనకు అంకితం చేసిన డాక్టర్ రోనాల్డ్ రాస్ 1932వ సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన కన్నుమూశారు. ఆయన కొంతకాలం హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్శిటీలో కూడా పరిశోధనలు చేశారు. ఆయన పేరిట ఇప్పటికీ హైదరాబాద్ బేగంపేటలో ‘సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీ’ విభాగం పనిచేస్తోంది. నోబెల్ పురస్కారం మలేరియా వ్యాధిపై డాక్టర్ రాస్ జరిపిన పరిశోధనలకు గాను ఆయనకు 1902వ సంవత్సరపు నోబెల్ పురస్కారం లభించింది. రోనాల్డ్ రాస్ జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలలో ముఖ్యమైనవి... జీవితంలో కొన్ని నిర్దిష్టమైన ఉన్నతాశయాలు పెట్టుకుని, వాటిని సాధించేవరకు కృషి చేయటం. తాను ఆంగ్లేయుడైనా జన్మించిన భారతదేశం పట్ల ఎంతో ప్రేమ, గౌరవంతో ట్రోపికల్ మెడిసిన విభాగంలో పనిచేయటం. వైద్య వృత్తిని స్వీకరించినా... ఆంగ్ల సాహిత్యం, గణిత శాస్త్రం మొదలైన రంగాల్లో ఆయన ప్రదర్శించిన నైపుణ్యం; కవిగా, రచయితగా, నాటక ప్రయోక్తగా కళాకారునిగా చూపిన శ్రద్ధాసక్తులు మొదలైనవి స్ఫూర్తిదాయకాలు. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యుడు భారత నోబెల్స్: నాటి నుంచి... నేటి వరకు... నోబెల్ పురస్కారం అందుకున్న శాస్త్రవేత్తలలో భారతదేశానికి సంబంధించిన వారు 13 మంది. వారిలో తొమ్మిదిమంది భారత పౌరులు. మిగిలిన నలుగురు భారత సంతతికి చెందిన వారు. ఆ ప్రముఖుల పేర్లు, వారు నోబెల్ పురస్కారం పొందిన సంవత్సరాలు, సేవలు అందించిన అంశాల వివరాలు.... 1902లో ఆల్మోరా (ఉత్తరాఖండ్)కి చెందిన సర్ రోనాల్డ్ రాస్. శరీర ధర్మశాస్త్రం, వైద్య శాస్త్రం, మలేరియా వ్యాధిపై పరిశోధనలు చేశారు. 1907లో ముంబైకి చెందిన రుడ్ యార్డ్ కిప్లింగ్. ఆంగ్ల సాహిత్యం, పిల్లల కథలు అంశానికి అందుకున్నారు. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్. బెంగాలీ సాహిత్యం, గీతాంజలి పద్య సంకలనం వంటి రచనలకు. 1930లో తమిళనాడుకి చెందిన సి.వి.రామన్. ‘భౌతిక శాస్త్రం కాంతి: రామన్ ఫలితం’ అనే పరిశోధనకు. 1968లో వెస్ట్ బెంగాల్‌కి చెందిన హరగోవింద్ ఖొరానా శరీర ధర్మ శాస్త్రం, వైద్య శాస్త్రం ప్రొటీన్ సంశ్లేషణకు. 1979లో మదర్ థెరిసా. ప్రపంచ శాంతి, రోగులకు సేవకు. 1983లో తమిళనాడుకి చెందిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. భౌతిక శాస్త్రం, అంతరిక్ష శాస్త్రంలో పరిశోధనలకు. 1998లో పశ్చిమ బెంగాల్‌కి చెందిన అమర్త్యసేన్. ఆర్థిక శాస్త్రం, ఆర్థిక సంక్షేమం అంశాల మీద అధ్యయనం. 2009లో తమిళనాడుకి వెంకటరామన్ రామక్రిష్ణన్. రసాయన శాస్త్రం, జీవ రసాయన శాస్త్రంలో పరిశోధనలకు. ఈ తొమ్మిదిమందీ భారతపౌరులు. ఈ కింద ఉదహరించిన నలుగురు భారత సంతతికి లేదా మనదేశంలో సంబంధాలు కలిగినవారు. 1979లో అబ్దుస్ సలామ్. భౌతిక శాస్త్రం 1989లో దలైలామా. ప్రపంచ శాంతి 2001లో ఎన్.ఎస్.నైపాల్. సాహిత్యం 2006లో మహమ్మద్ యూనస్ ప్రపంచ శాంతి డాక్టర్ రోనాల్డ్ రాస్ గౌరవార్థం వేల్స్ యువరాజు ‘రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్’ అనే సంస్థను స్థాపించారు. రోనాల్డ్ రాస్ జరిపిన పరిశోధనల వివరాలన్నీ ఈ సంస్థలో ఇప్పటికీ లభిస్తాయి. పైన పేర్కొన్న ప్రఖ్యాత వ్యక్తుల జీవిత విశేషాలు, వివిధ రంగాలలో వారి ఆవిష్కరణల వివరాలు, వ్యయ ప్రయాసలకోర్చి వారు చేసిన కృషి మొదలైన చారిత్రక విషయాలను చదవటం ద్వారా ఈ తరం విద్యార్థులకు, యువతకు ఎంతో స్ఫూర్తి, పట్టుదల, ఉత్సాహం కలుగుతాయి. ‘ఎనాఫిలస్’ జాతి దోమకాటు ద్వారా మలేరియా వ్యాధి సోకుతుందని రాస్ తెలుసుకున్నారు. డాక్టర్ రోనాల్డ్ రాస్ గౌరవార్థం వేల్స్ యువరాజు ‘రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్’ అనే సంస్థను స్థాపించారు. రోనాల్డ్ రాస్ జరిపిన పరిశోధనల వివరాలన్నీ ఈ సంస్థలో ఇప్పటికీ లభిస్తాయి.