
వాషింగ్టన్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1973లో ఉద్యోగం కోసం నింపిన ఓ దరఖాస్తు వచ్చే నెలలో వేలానికి రానుంది. తాను పోర్ట్ ల్యాండ్‌లోని రీడ్ కాలేజీలో చదువుతున్నట్లు ఈ దరఖాస్తులో స్టీవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ టెక్ లేదా డిజైన్ ఇంజనీర్ విభాగంలో తనకు నైపుణ్యమున్నట్లు వెల్లడించారు. కంప్యూటర్, క్యాలిక్యులేటర్లపై పనిచేయగలనని అందులో చెప్పారు. తప్పులతడకగా వివరాలు నింపిన ఈ దరఖాస్తులో తనకు ఫోన్ నంబర్ లేదని పేర్కొన్నారు. తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని ఆ దరఖాస్తులో స్టీవ్ తెలిపారు.
మార్చి 8 నుంచి 15 వరకూ ఆర్‌ఆర్ ఆక్షన్స్ నిర్వహించనున్న వేలంలో ఈ దరఖాస్తుకు సుమారు రూ.32 లక్షలు పలకవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ దరఖాస్తు నింపిన మూడేళ్ల అనంతరం స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి యాపిల్‌ను ప్రారంభించారు. దరఖాస్తుతో పాటు స్టీవ్ సంతకం చేసిన 2001 మ్యాక్ ఓఎస్ మాన్యువల్ పుస్తకం, ఐఫోన్ డిజైన్‌పై ప్రచురితమైన వార్తాపత్రిక కథనం క్లిప్ కూడా వేలానికి రానున్నాయి. వేలంలో మ్యాక్ మాన్యువల్ రూ.16.17 లక్షలు(25 వేల డాలర్లు), వార్తాకథనం క్లిప్ రూ.9.70 లక్షల(15 వేల డాలర్లు) ధర పలకవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment