సూపర్ మ్యానా? సూపర్ ఉమనా?! | Super Man? Super woman?! | Sakshi
Sakshi News home page

సూపర్ మ్యానా? సూపర్ ఉమనా?!

Published Sun, Feb 21 2016 2:58 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

సూపర్ మ్యానా? సూపర్ ఉమనా?! - Sakshi

సూపర్ మ్యానా? సూపర్ ఉమనా?!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో చరిత్ర సృష్టించేనా?
 
♦  రిపబ్లికన్ పార్టీ బరిలో ట్రంప్, క్రూజ్ సహా ఆరుగురు
♦ సుదీర్ఘంగా సాగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ    
♦ నవంబర్ 8న దేశంలో సాధారణ ఎన్నికల నిర్వహణ
♦ ఆ తర్వాత అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టొరల్ కాలేజీ    
♦ వచ్చే ఏడాది జనవరిలో కొత్త అధ్యక్షుడి ప్రమాణం
 
ప్రస్తుత ప్రపంచంలో అత్యంత శక్తిమంతుడు ఎవరు అంటే వచ్చే సమాధానం.. అగ్రరాజ్యంగా విలసిల్లుతున్న అమెరికాకి అధ్యక్షుడు! ఒక మాటతో ఒక ఉత్తర్వుతో ప్రపంచ గతిని మార్చేయగల సత్తా.. ప్రజల తలరాతలు తిరగరాయగల సామర్థ్యం ఆ పదవిలో ఉండే వ్యక్తికి సొంతం! అమెరికా అధ్యక్ష పదవికి మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీల నుంచి  హేమాహేమీలు హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రస్తుతం బరిలో ఎనిమిది మంది నిలిచారు. సాధారణ ఎన్నికలకు ముందు నాటికి ఆ సంఖ్య ఇద్దరికి తగ్గిపోతుంది. ఆ ఇద్దరిలో విజేత ఎవరనేది నవంబర్ 8వ తేదీన జరిగే ఎన్నికలు నిర్ణయిస్తాయి. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఈ పదవికి అమెరికన్లు ఈసారి మహిళను ఎన్నుకుంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. 2008 ఎన్నికల్లో తొలి నల్లజాతి అధ్యక్షుడిని ఎన్నుకుని చరిత్ర సృష్టించిన అమెరికా.. ఈసారి తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుని మరో చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. కొన్ని నెలల కిందటే ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ.. బరిలో ఎవరు ఉంటారు.. ఎవరికి విజయావకాశాలున్నాయి.. అమెరికన్లు ఎటువైపు మొగ్గుతున్నారు.. అనేదానిపై స్పష్టత రావటానికి ఇంకొన్ని నెలల సమయం పడుతుంది. సుదీర్ఘంగా సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తీరుతెన్నులపై ‘సాక్షి’ ఫోకస్...                                                                    
- సెంట్రల్ డెస్క్
 
 నవంబర్‌లో ఆ మంగళవారం...
 అమెరికా అధ్యక్ష పదవికి ప్రతి నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు 58వ అధ్యక్ష ఎన్నికలు. నవంబర్ నెలలో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం (ఈ ఏడాది నవంబర్ 8వ తేదీ) ఎన్నికలు నిర్వహిస్తారు. 1845 నుంచీ ఇలాగే జరుగుతోంది. వీటితో పాటు సమాఖ్య (కేంద్ర), రాష్ట్ర, స్థానిక ఎన్నికలు కూడా జరుగుతాయి. వీటిని సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయటానికి ఆ దేశంలోనే జన్మించిన పౌరులే అర్హులు. వయసు 35 ఏళ్లు నిండాలి. కనీసం పద్నాలుగేళ్ల పాటు అమెరికాలో నివసించి ఉండాలి. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తికి మూడోసారి అధ్యక్ష పదవికి పోటీపడే అర్హత ఉండదు.

 మూడో పార్టీ ఎందుకు లేదు?
 ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా రాజకీయాలను కేవలం రెండంటే రెండు పార్టీలే శాసిస్తాయి. డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. ఈ రెండు పార్టీల మధ్య మాత్రమే అధికారం మారుతుంటుంది. మరి మూడో, నాలుగో, ఐదో పార్టీకి అవకాశం ఎందుకు లేదు? అసలు బరిలో దిగుతున్నట్లు కూడా ఎందుకు కనిపించదు?

 డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు కాకుండా ప్రధాన రాజకీయ పార్టీ
 లుగా గుర్తింపున్న మరో మూడు పార్టీలూ అమెరికాలో ఉన్నాయి. అవి.. లిబర్టేరియన్ పార్టీ, గ్రీన్ పార్టీ, కాన్‌స్టిట్యూషన్ పార్టీ. ఇక.. 1869లో స్థాపించిన ప్రొహిబిషన్ పార్టీ, 1919లో స్థాపించిన కమ్యూనిస్టు పార్టీ మొదలుకుని.. 2011లో స్థాపించిన జస్టిస్ పార్టీ.. 2014లో స్థాపించిన ట్రాన్స్‌హ్యూమన్ పార్టీ వంటి 30కి పైగా పార్టీలు ‘చిన్న పార్టీలు’గా ఉన్నాయి. మరెన్నో రాజకీయ పార్టీలు పుట్టినా.. కాలక్రమంలో కనుమరుగయ్యాయి. ఇక రాష్ట్రాల వారీగా ప్రాంతీయ పార్టీలూ గణనీయంగానే ఉన్నాయి. ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ.. 1868 లో స్థాపితమైన డెమొక్రటిక్ పార్టీ.. 1854లో ఏర్పాటైన రిపబ్లికన్ పార్టీ.. ఈ రెండే శతాబ్దాలుగా రాజ్యమేలుతున్నాయి. అందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం. రెండోది.. ఆ ఎన్నికల్లో పార్టీకి అయ్యే వ్యయం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం పూర్తి భిన్నమైనది. రాష్ట్రాల్లో ప్రజలు సాధారణ ఎన్నికల్లో ఎన్నుకునే ఎలక్టర్లను గంప గుత్తగా ఏదో ఒక పార్టీ అభ్యర్థిని బలపరిచేలా ఎన్నుకుంటారు. అంటే సాధారణ ఎన్నికల్లో మెజారిటీ పొందిన పార్టీయే అంతిమం. మొత్తం 50 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీలో ఎలక్టర్ల ఎన్నికలు ఈ తరహాలోనే జరుగుతాయి. ఈ విధానంలో మూడో, నాలుగో పార్టీకి స్థానం మృగ్యమవుతుంది. ఇక ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు.. ఒకసారి పార్టీ నామినేషన్ కోసం దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలి. నామినేషన్ దక్కాక అధ్యక్ష ఎన్నికల కోసం మరోసారి దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలి. ఇందుకు వందల కోట్ల డాలర్లు వ్యయమవుతుంది. 2012 ఎన్నికల్లో బరాక్ ఒబామా ఒక్కరే 100 కోట్ల డాలర్లు వ్యయం చేశారన్నది విశ్లేషకుల అం చనా. ఆ ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు 700 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు లెక్క తేలింది. ఇంత భారీ వ్యయం చేయటానికి అవసరమైన బడా వ్యాపార సంస్థల ‘విరాళాల’ మద్దతు దశాబ్దాలుగా వేళ్లూనుకున్న ప్రధాన పార్టీలు రెండిటికే అధికంగా లభిస్తుంది. ఎందుకంటే గెలిచే అవకాశాలు వాటికే ఉంటాయి కాబట్టి. మూడో పార్టీ దేనికీ అంతగా వ్యయం చేయగల పరిస్థితి లేదు. ఒకవేళ చేసినా.. ‘ఓడిపోయే’ పార్టీ ముద్రతో పోటీకి ముందే ఓటమి పాలవుతుంది. ఇటీవలి కాలంలో.. రాస్ పెరోట్ సారథ్యంలో.. రిఫార్మ్ పార్టీ 1992, 1996లో భారీ నిధులు వ్యయం చేసి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది. రెండుసార్లూ ఒక్క ఎలక్టర్ ఓటూ దక్కలేదు.
 
 ఇటు హిల్లరీ.. సాండర్స్
 డెమొక్రటిక్ పార్టీలో ప్రారంభ ప్రైమరీలు ముగిసే సరికి ఇద్దరు అభ్యర్థులు బరిలో పడుతున్నారు. ఒకరు హిల్లరీ క్లింటన్.. మరొకరు బెర్నీ సాండర్స్. జిమ్ వెబ్, లింకన్ చాఫీ, మార్టిన్ ఓ మాలే తొలుత పోటీపడతామని ప్రకటించినప్పటికీ.. అనంతరం బరి నుంచి తప్పుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు (1993-2001) బిల్ క్లింటన్ భార్య అయిన హిల్లరీ క్లింటన్.. 2000 సంవత్సరంలో న్యూయార్క్ నుంచి సెనెటర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా తొలి మహిళగా ఉంటూ సెనెటర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2006 లోనూ రెండోసారి సెనెటర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 2008 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ కోసం బరాక్ ఒబామాతో పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో పార్టీ టికెట్ పొందిన ఒబామా ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికలతో పాటు, వరుసగా 2012 అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలుపొందటం తెలిసిందే. హిల్లరీ 2008 ఎన్నికల తర్వాత ఒబామా సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2013 వరకూ ఆ పదవిలో కొనసాగారు. తాజా అధ్యక్ష ఎన్నికలకు మరోసారి పార్టీ నామినేషన్ కోసం బరిలో దిగారు. పార్టీలో ప్రత్యర్థి, వెర్మాంట్ సెనెటర్ బెర్నీ సాండర్స్ కన్నా ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. ఆమె డెమొక్రటిక్ నామినేషన్ పొంది.. ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలుపొందితే.. అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ (అధ్యక్షురాలు)గా చరిత్ర సృష్టిస్తారు.
 
 ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజీ...
 అమెరికా అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. తొలుత పౌరులు అమెరికా ఎలక్టోరల్ కాలేజీకి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు నేరుగా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయ సభల్లో.. ఆ రాష్ట్రానికి గల సభ్యుల (సెనేటర్లు, రిప్రజెంటేటివ్‌లు) సంఖ్యకు సమానంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది. ఫెడరల్ ప్రభుత్వ ప్రమేయం ఉండదు. అదనంగా.. దేశ రాజధాని జిల్లా అయిన వాషింగ్టన్ డి.సి.కి దేశంలోని అతి చిన్న రాష్ట్రానికి గల సభ్యులకు సమానంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను కేటాయిస్తారు. అంటే.. ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు 435, సెనేట్ సభ్యులు 100 మంది, వాషింగ్టన్ డీసీకి ముగ్గురు అదనపు సభ్యులు.. మొత్తం కలిపి 538 మంది ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు ఎన్నికవుతారు. వీరిని ఎలక్టర్లుగా వ్యవహరిస్తారు. అందులో కనీసం 270 ఓట్లు పొందిన అభ్యర్థి అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు.
 
 అటు ట్రంప్.. క్రూజ్..
 రిపబ్లికన్ పార్టీ బరిలో డొనాల్డ్ ట్రంప్, టెడ్ క్రూజ్, జెబ్ బుష్, మార్కో రుబియో, బెన్ కార్సన్, జాన్ కాసిచ్ - మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆరంభంలో తామూ పోటీ పడతామని ప్రకటించిన వారిలో భారత సంతతికి చెందిన బాబీజిందాల్ కూడా ఉన్నారు. ఆయన మొదట్లోనే పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కార్లీ ఫియోరినా అనే మహిళా అభ్యర్థి సహా పలువురు ఆశావహులూ వైదొలగారు. బరిలో ఆరుగురు ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ ట్రంప్, క్రూజ్‌ల మధ్యే నెలకొన్నట్లు కనిపిస్తోంది.

న్యూయార్క్ నివాసి అయిన ట్రంప్ బడా వ్యాపారవేత్త. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం బరిలోకి దిగింది మొదలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆయన మాటల్లో జాతి వివక్ష, మహిళల పట్ల వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇక టెక్సాస్ నుంచి సెనేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టెడ్ క్రూజ్.. ఐయోవా కాకస్‌లో గెలిచి ట్రంప్‌కు చెమటలు పట్టించారు. అయితే.. తాజాగా అధ్యక్ష పదవికి ఆయన అర్హతపై కోర్టులో కేసు దాఖలవటంతో క్రూజ్ ఈ రేసులో నిలవటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే పార్టీ నుంచి బరిలో ఉన్న మరో ముఖ్యమైన వ్యక్తి బెజ్ బుష్. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్. డబ్ల్యు. బుష్ కుమారుడు, మరో మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు. బుష్ సోదరుడు జెబ్ బుష్. 1999 నుంచి 2007 వరకూ ఫ్లోరిడా గవర్నర్‌గా పనిచేశారు. ఆయన పార్టీ నామినేషన్ గెలుచుకుని, అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే.. బుష్ కుటుంబంలో మూడో వ్యక్తి ఆ పదవి చేపట్టినట్లవుతుంది. తాజా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ నామినేషన్ కోసం బరిలోకి దిగారు. కానీ.. ప్రస్తుతం రేసులో ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన పుంజుకోవటం కష్టమేనన్నది పరిశీలకుల అంచనా.
 
 రెండేళ్లు సాగే ఎన్నికల ప్రక్రియ...
 అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ఆరంభం నుంచి ముగింపు వరకూ దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది. ఆ ప్రక్రియ ఇలా సాగుతుంది...
► ఆయా పార్టీల నుంచి అధ్యక్ష పదవి టికెట్ కోసం తాము రేసులో ఉన్నట్లు ఆశావహ అభ్యర్థులు ప్రకటిస్తారు. ఆ తర్వాత విరాళాల సేకరణ ప్రారంభించి ప్రచార రంగంలోకి దిగుతారు.
► ఒక్కో పార్టీ నుంచి అధ్యక్ష పదవి టికెట్‌ను ఆశిస్తున్న అభ్యర్థులు తమలో తాము పోటీ పడతారు. తమ తమ ఆలోచనలు, ప్రణాళికలను వివరించటం, చర్చించటం.. పార్టీలో ప్రత్యర్థి ఆలోచనలు, ప్రణాళికలను విమర్శించటం రూపంలో ఈ పోటీ నడుస్తుంది.
► పార్టీల వారీగా ప్రైమరీ ఎన్నికలు, కాకసస్ ఎన్నికలు నిర్వహిస్తారు. రిపబ్లికన్ పార్టీ డెలిగేట్లు రిపబ్లికన్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. డెమొక్రటి క్ పార్టీ డెలిగేట్లు డెమొక్రటిక్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. డెలిగేట్ల ఓట్లలో మెజారిటీ ఓట్లు పొందిన అభ్యర్థులకు సదరు పార్టీ టికెట్ లభిస్తుంది.
► అనంతరం ఒక్కో పార్టీ వారం రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించి.. లాంఛనంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్య పదవులకు పోటీ పడే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంది. సాధారణంగా.. అధ్యక్ష పదవి టికెట్‌ను గెలుచుకున్న అభ్యర్థే.. తనతో కలిసి ఉపాధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తారు.
► ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. వివిధ పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ప్రచారంలో తలపడతారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. తమ ప్రణాళికలను వివరిస్తారు.
► ప్రచార పర్వం ముగిశాక సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. కానీ వారు ఎన్నుకునేది అధ్యక్షుడిని కా దు.. తమ రాష్ట్రం నుంచి అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టర్ల బృందాన్ని. నిజానికి ఈ ఎలక్టర్లు ముందుగానే ఏదో ఒక పార్టీ అధ్యక్ష అభ్యర్థికి కట్టుబడి ఉంటారు. తాము కోరుకునే అధ్యక్ష అభ్యర్థికి కట్టుబడ్డ ఎలక్టర్ల కూటమికి ప్రజలు ఓట్లు వేస్తారు. ఎలక్టర్లు ఆ కట్టుబాటు తప్పరాదన్న ఆంక్షలేవీ లేనప్పటికీ.. దానిని తప్పటం చాలా చాలా అరుదు.
► ఇలా ఎన్నికైన ఎలక్టర్లందరూ కలిసి ఎలక్టోరల్ కాలేజీ అవుతారు. వారంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కానీ.. వారందరూ కలిసి ఒకే చోట సమావేశమై అధ్యక్షుడికి ఓట్లు వేయరు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఎలక్టర్లు సమావేశమై తాము ముందే కట్టుబడ్డ అభ్యర్థికి ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ ఓట్లు పొందిన అభ్యర్థులు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికవుతారు.
► ఒకవేళ ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు)లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ - దిగువ సభ) అధ్యక్షుడ్ని ఎన్నుకుంటుంది. అదే.. ఉపాధ్యక్ష పదవికి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో సెనేట్ (ఎగువ సభ) ఆ ఎన్నిక చేస్తుంది. ఇలా అరుదుగా జరుగుతుంది. చివరిసారిగా 2002 ఎన్నికల్లో ఇలా జరిగింది.
► ఇలా ఎన్నిక ప్రక్రియ పూర్తయిన మూడు, నాలుగు నెలల తర్వాత జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.
 ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రక్రియ.. ఫిబ్రవరి 1న అయోవా కాకస్‌తో మొదలైంది. జూన్ ఏడో తేదీన చివరి ప్రైమరీలు జరుగుతాయి. అప్పటికి ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థికి టికెట్ దక్కనుందన్నది ఖరారవుతుంది. జూలై 18న రిపబ్లికన్ పార్టీ సదస్సు, అదే నెల 25న డెమొక్రటిక్ పార్టీ సదస్సు జరుగుతాయి. ఆ తర్వాత ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య అధ్యక్ష ఎన్నికల సమరం మొదలవుతుంది. సెప్టెంబర్ 26న అధ్యక్ష అభ్యర్థుల మధ్య తొలి చర్చా కార్యక్రమం జరుగుతుంది. నవంబర్ 8వ తేదీన దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరుగుతాయి. కొద్ది రోజుల తర్వాత ఎలక్టోరల్ కాలేజీ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement