ముఖంలో పేలని గ్రెనేడ్.. వైద్యుల ఆ'పరేషన్'
బొగోటా: ప్రమాదవశాత్తూ ఓ సైనికుడి ముఖంలోకి దూసుకెళ్లిన గ్రెనేడ్ను వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. కొలంబియాలోని బొగోటాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో కారు పార్కింగ్ స్థలాన్నే మిలిటరీ ఆసుపత్రి డాక్టర్లు ఆపరేషన్ థియెటర్గా మార్చారు. గ్రెనేడ్ ఏ క్షణంలో అయినా పేలే ప్రమాదం ఉండటంతో డాక్టర్లు ఈ ఆపరేషన్ను జాగ్రత్తగా పూర్తి చేసి సైనికుడి ప్రాణాలతో పాటు తమ ప్రాణాలనూ కాపాడుకున్నారు.
కొలంబియా సైనికుడి ముఖంలోకి ఆ గ్రెనేడ్ ఎలా దూసుకెళ్లింది అనే విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. మిలిటరీ క్యాంప్లో జరిగిన ఓ ప్రమాదంలో గ్రెనేడ్ ముఖంలోకి దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు. గ్రెనేడ్ను తొలగించడంతో సదరు సైనికుడు ఇప్పుడు కోలుకుంటున్నాడు. అత్యంత ధైర్యసాహసాలతో ఆపరేషన్ నిర్వహించిన వైద్యులను ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. చీఫ్ సర్జన్ విలియం సాంచెజ్ మాట్లాడుతూ..' గ్రెనేడ్ ఏ క్షణంలో అయినా పేలే ప్రమాదం ఉండటంలో మిగిలిన పేషెంట్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని కారు పార్కింగ్ స్థలంలో ఆపరేషన్ను నిర్వహించాం. అవి చాలా ఉద్విగ్నమైన క్షణాలు. పేలుడు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం' అని తెలిపారు.