చిన్నారి బనా సేఫ్.. అధ్యక్షుడి వద్ద ప్రత్యక్షం
అంకారా: అతి పిన్న వయస్సులోనే తమ దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యలను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ మొత్తం ప్రపంచ దృష్టినే ఆకర్షించిన సిరియాలోని అలెప్పో నగరానికి చెందిన ఏడేళ్ల చిన్నారి బనా అల్ అబెద్ టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆయన ఆ పాపను ప్రేమగా దగ్గరకు తీసుకొని ఎత్తుకొని మురిపించాడు. ఇంత చిన్న వయసులోనే భయానక దృశ్యాలను ఒక బాధ్యతగా కళ్లకు కట్టినట్లు చూపిన ఆ పాపను ప్రత్యక్షంగా చూసి అధ్యక్షుడు ముగ్దుడయ్యారు.(ప్రియమైన ప్రపంచమా మళ్లీ కలుద్దాం.. సెలవు)
అంకారాలోని తన ప్యాలెస్‌లో ఈ చిన్నారిని ఎర్డోగన్ కలిశారు. సిరియాలోని ప్రముఖ నగరం అలెప్పోలో ప్రభుత్వ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య గత కొద్ది రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అలెప్పోలో ఉగ్రమూకలను తరిమి వేయాలనే లక్ష్యంతో చేసే బాంబుల దాడుల కారణంగా ఎంతో మంది అమాయకులు బలవ్వడమే కాకుండా నగరమంతటా విధ్వంసం జరిగింది. ఎక్కడ ఎప్పుడు బాంబు పడుతోందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ దృశ్యాలన్నింటిని బనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరించింది. వీడియోలను పోస్ట్ చేసింది. చివరి ట్వీట్ గా తమ ఇంటిపై బాంబు పడిందని, తాము బ్రతికి ఉంటే మళ్లీ కలుస్తామంటూ చెప్పింది. ('గుడ్ మార్నింగ్.. మేమింకా బతికే ఉన్నాం')
అనంతరం ట్విట్టర్ ఖాతా నుంచి మాయమైంది. దీంతో ఆ పాపకు ఏమై ఉంటుందో అని ప్రతి ఒక్కరూ ఆందోళన పడ్డారు. ఎట్టకేలకు అక్కడ నుంచి తరలించిన బలగాలు వారిని సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించిన నేపథ్యంలో బనా తన కుటుంబంతో కలిసి ఎర్డోగన్‌ను కలిసింది. ఈపాపకు ట్విట్టర్‌లో దాదాపు 3,33,000మంది ఫాలోవర్లు ఉన్నారు. వాళ్లమ్మ ఓ ఆంగ్ల టీచర్. ఆమెనే బనా పేరు మీద ట్విట్టర్ ఖాతా తెరిచింది. అంతకుముందే ఈ పాప కుటుంబానికి ఆశ్రయం ఇస్తామని టర్కీ ప్రకటించింది. అయితే, వారు ఎప్పుడు సిరియా సరిహద్దు దాటి వెళ్లారనే విషయం మాత్రం తెలియదు.