ముస్లింలకు టెకీల సంఘీభావం
న్యూయార్క్: అమెరికాకు వలసవచ్చిన ముస్లింలు ఎవరో తెలుసుకునేందుకు అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేయాలనుకుంటున్న రిజిస్టరీ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమంటూ గూగుల్, ట్విట్టర్ సహా పలు టెక్నాలజీ కంపెనీలకు చెందిన 1200 టెకీలు ప్రతిజ్ఞ చేశారు. ఓ మతం ప్రాతిపదికన వ్యక్తులను దేశం నుంచి వెనక్కి పంపించడాన్ని తాము అంగీకరించమని స్పష్టం చేశారు.
ఈ విషయంలో అమెరికాలోని ముస్లింలందరికి తాము సంఘీభావం తెలియజేస్తున్నామంటూ టెకీల ప్రతిజ్ఞా పత్రాన్ని ‘నెవర్‌అగేన్ డాట్ టెక్’లో పొస్ట్ చేశారు. తాము పని చేస్తున్న టెకీ కంపెనీల్లో ముస్లిం పేర్లను ప్రత్యేకంగా నమోదుచేసే రిజిస్టర్ అంగీకరించమని కూడా స్పష్టం చేశారు. ముస్లిం ఉద్యోగులను ప్రత్యేకంగా గుర్తించేందుకు తమను రిజిస్టర్ మెయింటేన్ చేయాల్సిందిగా అమెరికా అధికార వర్గం నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని గూగుల్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ అలాంటి ఉత్తర్వులు వచ్చినా తాము అలాంటి పనిచేయమని స్పష్టం చేశాయి. సిలికాన్ వ్యాలీలోని పలు కంపెనీలు ఇంకా ఈ అంశంపై మౌనం పాటిస్తున్నాయి.
2001, సెప్టెంబర్ 11 నాడు అమెరికాలో జరిగిన దాడుల అనంతరం దేశంలోకి వచ్చే, పోయే ప్రజల వివరాలను నమోదుచేసే రిజిస్టర్‌ను మళ్లీ పునరుద్ధరించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. దేశ ప్రజల నుంచే కాకుండా పలు దేశాల నుంచి కూడా విమర్శలు రావడంతో ఈ రిజిస్టర్ విధానాన్ని అమెరికా ప్రభుత్వం 2011లో ఎత్తివేసింది. ముస్లిం దేశాల నుంచి దేశానికి వలసవచ్చిన ముస్లింలను వెనక్కి పంపిస్తానంటూ దేశాధ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ హెచ్చరికలు చేసిన విషయం తెల్సిందే.