కపుల్స్ పెళ్లి రోజు ఎంజాయ్లో ఉండగా..
చికాగో: చెమటపట్టిందని ఓ ముస్లిం దంపతులను అమెరికాకు చెందిన విమానంలో నుంచి దింపేశారు. వారు అల్లా అని కూడా సంబోధించారనే కారణంతో వారిని అర్థాంతరంగా విమానంలో నుంచి పంపించేశారు. పాక్ సంతతికి చెందిన నజియా, ఫైజల్ అనే అమెరికా దంపతులు అమెరికాకు చెందిన విమానంలో ప్యారిస్ నుంచి ఓహాయోలోని సిన్సినాటికి బయలుదేరారు. మొత్తం తొమ్మిదిగంటల ప్రయాణం.
విమానంలోకి ఎక్కిన తర్వాత నజియా తన షూ విప్పేసి తల్లిదండ్రులకు ఎస్సెమ్మెస్ పెట్టి హెడ్ ఫోన్ పెట్టుకొని సీట్లో వాలిపోయింది. అదే సమయంలో ఈ విమానానికి చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది వారి వద్దకు వచ్చారు. తాను ఆ ముస్లిం దంపతులను అసౌకర్యంగా భావిస్తున్నానని విమాన సిబ్బంది పైలెట్ కు చెప్పింది. అంతేకాకుండా ఆమె అనుమానాస్పదంగా కనిపించిందని, ఆమెకు చెమటలు కూడా ప్రారంభమయ్యాయని, ఆమె భర్త కూడా రహస్యంగా ఫోన్ దాచుకునే ప్రయత్నం చేశాడని.. అదే క్రమంలో వారిద్దరు అల్లా అని అరవడం తనకు వినిపించిందని చెప్పింది.
దీంతో విమానాశ్రయంలో సిబ్బందికి ఫోన్ చేసిన పైలెట్ వారిద్దరిని దించే వరకు విమానం కదలదని చెప్పేశాడు. 'మేం అప్పటికే 45 నిమిషాలపాటు మా సీట్లలో కూర్చున్నాం. అప్పుడే ఓ విమాన సిబ్బంది వచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి మాతో కిందికి వస్తారా అని అడిగాడు. మా వస్తువులు కూడా తెచ్చుకోవాలా అని ప్రశ్నించాం. మీ సామాను మొత్తం తీసుకొని రండి అని చెప్పాడు. మీరు ఈ విమానంలో వెళ్లడం లేదు అన్నాడు. అనంతరం మమ్మల్ని ఫ్రెంచ్ పోలీసులు ప్రశ్నించారు. మాతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు' అని ఫైజల్ చెప్పింది.
పదో సంవత్సర వివాహ వేడుక సందర్భంగా హాలీడేలో ఉన్న వాళ్లిద్దరికి ఈ చేదు అనుభవం ఎదురైంది. అనంతరం వారు వేరే విమానంలో వెళ్లారు. కాగా, ఈ ఘటనపట్ల ఓ ముస్లిం సంస్థ విమానసంస్థకు నోటీసులు ఇవ్వగా తాము ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పింది. తమ సంస్థ తరుపున ఎవరి విషయంలో అసలు వివక్ష చూపించబోమని.. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తామని సదరు సంస్థ తెలిపింది.