భార్య ప్రాణాల కోసం ‘పరుగు’
ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న భార్య ప్రాణాలను రక్షించుకోడానికి ప్రాణాలకు తెగించి పరుగందుకున్నాడు ఈ మారథాన్ వీరుడు. ఆస్ట్రేలియాకు చెందిన టెడ్ జాక్‌సన్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఖండాంతరాల్లో జరిగిన ఏడు మారథాన్లలో పాల్గొని విజేతగా ఏకంగా కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు. వాటిని భార్యకు చికిత్స అందిస్తున్న ప్రొఫెసర్ జార్జి జెలినెడ్ నేతృత్వంలోని చారిటీ సంస్థకు అందజేశాడు. 42 ఏళ్ల టెడ్ జాక్సన్ అథ్లెట్ కాదు. ఏనాడూ పరుగు పందేల్లో పాల్గొన్న అనుభవం లేదు. మల్టిపుల్ స్క్లెరోసిస్ (ప్రాణాంతక నరాల జబ్బు)తో బాధ పడుతున్న భార్యను ఎలాగైనా రక్షించుకోవాలని తపన పడ్డాడు. ఆ తపన నుంచే మారథాన్‌లో పాల్గొనాలనే ఆలోచన పుట్టుకొచ్చింది. గడ్డకట్టిన మంచుప్రాంతాల నుంచి కాళ్లు మంటలెత్తే ఎడారుల గుండా సాగిన ఏడు మారథాన్లను ఏడు రోజుల్లో ముగించి చరిత్ర సృష్టించాడు. అంటార్కిటిక, మొరాకో, దుబాయ్, మియామీ, చిలీ, మాడ్రిడ్, సిడ్నీలలో జరిగిన ఏడు మారథాన్లలో పాల్గొని 182 మైళ్లు పరుగుతీశాడు.
జాక్సన్ 20వ ఏటనే అప్పటికి 18 ఏళ్లున్న సోఫీని పెళ్లి చేసుకున్నాడు. 2010 వరకు వారి సహజీవనం సుఖంగానే సాగింది. నడవలేకపోతున్న పరిస్థితుల్లో ఆమెకు మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే నరాల జబ్బు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికీ ఆ జబ్బుకు శాశ్వత చికిత్స అందుబాటులోకి రాలేదు. జీవితకాలాన్ని పొడిగించడం మాత్రమే వైద్యులు చేయగలుగుతున్నారు. ఈ జబ్బును వైద్య నిపుణులు మరణశిక్షగా కూడా అభివర్ణిస్తారు.ఈ జబ్బు కారణంగా కాళ్లు చేతులు చచ్చుపడి చక్రాల కుర్చీకి అతుక్కుపోతారు. మరికొంత మంది మంచపట్టి ఇక లేవలేరు. సకాలంలో చికిత్సను ప్రారంభించడం వల్ల సోఫీకి ఇంకా ఆ పరిస్థితి రాలేదు. ఏదేమైనా తాను బతికున్నంతకాలం సోఫీని తన కళ్లముందు నవ్వుతూ చూడాలని కోరుకుంటున్నానని, అవసరమైతే ఇంకా మరెన్నో మారథాన్లలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవలనే సిడ్నీ మారథాన్‌లో విజేతగా నిలిచిన జాక్సన్ మీడియా ముందు వెల్లడించాడు. ఆ భార్యాభర్తల ప్రేమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఇంకేమైనా ఉంటుందా!