లాస్ ఏంజిల్స్: అమెరికన్ లగ్జరీ ఎలెక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మూడు ఎలక్ట్రిక్ కార్లను కస్టమర్లకు అందించింది. కాలిఫోర్నియాలోని ఫ్రెమొంట్ వాహన తయారీ కర్మాగారంలో సంస్థ మొట్టమొదటి 30మందిలో ముగ్గురు కొనుగోలుదారులకు కార్ల కీ ని అందజేసింది.
మోస్ట్ ఎవైటెడ్ ఎఫర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీకి శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ముగింపు పడిందని టెస్లా సీఈవో ఎల్లోన్ మస్క్ ప్రకటించారు. అమెరికా మార్కెట్లో మోడల్ 3 ప్రారంభ ధర 35వేల డాలర్లుగా (సుమారు రూ. 22.8 లక్షలు) ఉండనుంది. కాగా ఇప్పటికే లాంచ్ చేసిన మొట్టమొదటి మూడు వాహనాలు - రోడస్టర్, మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లు చాలా ఖరీదు. దాదాపు లక్ష డాలర్లకు ( సుమారు రూ. 64 లక్షలు) పై మాటే. టెస్లా ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోల్చుకుంటే మోడల్ 3 అత్యంత సరసమైన కారుగా చెప్పొచ్చు.
మొత్తం అల్యూమినియం బాడీకాకుండా కొంత స్టీల్‌తో రూపొందించారు. ఇంకా సింగిల్ చార్జ్‌తో 5 నుంచి 6 సెకన్స్ లో 0.60 ఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అయితే లార్జ్ బ్యాటరీ, ఆన్ స్క్రీన్ డ్యాష్ బోర్డు, ఫాన్సీ వీల్స్, మెటాలిక్ పెయింట్, అటానమస్ డ్రైవింగ్ ఫీచర్స్‌ను కావాలంటే కస్టమర్లు జోడించుకోవచ్చు. అలాగే ఈ కారుకు నాలుగు సంవత్సరాల, 50,000 మైళ్లవరకు వారంటీ ఉంది. 100,000 మైళ్ళ పరిధిలో ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఉంది.
ఇది టెస్లా కు సంబంధించి గొప్ప రోజు..ఎప్పుడూ కేవలం ఖరీదైన కార్లనే తయారు చేయడం తమ లక్ష్యం కాదని , కార్లను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని తాము కోరుకుంటున్నామని టెస్లా సీఈవో మీడియాకు చెప్పారు. మోడల్ 3 కార్లను ఇపుడు ప్రీ బుకింగ్ చేసుకుంటే 2018లో చివరికి నాటికి అందించే అవకాశం ఉందని చెప్పారు. టెస్లా రూపొందించే ప్రతిదీ అందమైనదిగా ఉంటుందని టెస్లా చీఫ్ డిజైనర్ ఫ్రాంజ్ వాన్ హోల్జాజెన్ అన్నారు. మోడల్ 3 మరింత విశాలంగా కనిపించడానికి ప్రత్యేకంగా గ్లాస్ రూఫ్‌తో తయారు చేసినట్టు చెప్పారు.
ప్రస్తుతం ఈ కారుకు డిమాండ్ విపరీతంగా ఉండడంతో మోడల్ 3 ప్రొడక్షన్ పెద్ద ఛాలెంజ్ అని టెస్లా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2017 ఆగష్టు నాటికి 100 కార్లను, సెప్టెంబర్ 2017 నాటికి 1500 కార్లను ఉత్పత్తి చేయనుంది.