బ్యాంకాక్ : తన సోదరి ఉబోల్ రతన(67) ప్రధాని పదవికి పోటీ చేస్తాననడం పట్ల థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్ విముఖత వ్యక్తం చేశారు. రాచరిక సంప్రదాయాలకు విరుద్ధంగా ఓ రాజవంశీకురాలు ఎన్నికల్లో పోటీ చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘ రాజు, రాజవంశీకులు రాజకీయాలకు అతీతం. రాజవంశీకులను రాజకీయ వ్యవస్థలో భాగస్వాములు చేయాలనుకోవడం రాచ, థాయ్ సంప్రదాయాలకు విరుద్ధం. ఇలా చేయడం సరైంది కాదు. రాచరికాన్ని, ప్రతిష్టను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక యువరాణిగా ప్రజలకు ఆమె అందించిన సేవలు ఆదర్శనీయం’ అంటూ ఉబోల్ రతనను ప్రశంసిస్తూ, ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన పార్టీని విమర్శిస్తూ రాయల్ గెజిట్‌ను విడుదల చేశారు.
కాగా థాయ్‌లాండ్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఉబోల్ రతన శుక్రవారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. థాయ్ మాజీ ప్రధాని థక్షిన్ షినవ్రతకు చెందిన ‘థాయ్ రక్ష చార్త్ పార్టీ’ తరఫున పోటీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో ఇన్నాళ్లుగా విజయం తమదే అన్న విశ్వాసంతో ఉన్న సైనిక పాలకుల్లో ఆందోళన మొదలైంది. అయితే రతన తన నిర్ణయం ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాయల్‌గెజిట్ వెలువడటం గమనార్హం. ఇక 1972లో అమెరికా దేశస్తుడు పీటర్ జెన్సెన్‌ను వివాహం చేసుకున్న రతన, రాచరిక గౌరవాలను వదులుకున్నారు. ఏకైక కొడుకు మరణం, భర్తతో విడాకులు తర్వాత రాచ కుటుంబ సభ్యురాలిగానే కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment