ఇక్కడేం జరుగుతోంది? ఎందుకు అందరూ ఇలా నేలపై పాకుతున్నారు? ఈవిడెవరు? ఆయనెవరు? అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం.. ఇక్కడ థాయ్‌లాండ్ రాజుగారి పెళ్లి జరుగుతోంది.. ఆ నేలపై ఉన్నావిడ థాయ్‌లాండ్ మహారాణి!
థాయ్ కింగ్ మహా వజిరాలాంగ్‌కార్న్(66) తన సహచరి సుతిద(40)ను బుధవారం అధికారికంగా వివాహమాడారు. ఆమెకు మహారాణి హోదా ప్రకటించారు. ఆయనకిది నాలుగో పెళ్లి. శనివారం ఆయన మహాపట్టాభిషేకానికి దేశం సన్నద్ధమవుతున్న వేళ.. ఈ వివాహం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటికే మహావజిర ముగ్గురిని పెళ్లాడటం.. విడాకులు ఇచ్చేయడం జరిగింది. థాయ్ ఎయిర్‌వేస్‌లో ఓ సామాన్య ఫ్లయిట్ అటెండెంట్ స్థాయి నుంచి రాజుగారి వ్యక్తిగత బాడీగార్డుగా మారిన సుతిదకు ఏకంగా జనరల్ స్థాయి ర్యాంకును కూడా ఇచ్చారు. చాన్నాళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది. వీటి సంగతిని అలా ఉంచితే.. ఈ పాకుడు ఏమిటని ఆరా తీస్తే.. ఇదంతా రాజమహల్ సంప్రదాయాల ప్రకారం వివాహం జరగడమట.
థాయ్ సంప్రదాయం ప్రకారం రాజు అంటే దేవుడు కింద లెక్క. దాని వల్ల ఎక్కడైనా రాజుగారు పైనే ఉండాలి. మిగతావారు ఆయన కన్నా అలా కిందన ఉండాలి. అందుకే ఈ పెళ్లిలో చివరికి వధువు కూడా మిగతావారితో పాటు నేలపై పాక్కుంటూ ఉండాల్సి వచ్చింది. రాజమహల్‌కు సంబంధించిన చాలా అధికారిక కార్యక్రమాల్లో కిందున్నవారు ఇలా పాకుతూనే వస్తారట. దీన్ని అవమానం కింద కాకుండా.. రాజుగారికి ఇచ్చే సమున్నత గౌరవానికి ప్రతీకగా వారు భావిస్తారు. వధువు రాజుగారి కాళ్ల దగ్గర అలా పాకడం.. నమస్కరించడం అన్నది కూడా ఇదే లెక్క కిందకు వస్తుందట. సుతిదకు మహారాణి బిరుదు ప్రదానం చేసిన తర్వాత ఆమెను రాజుగారు తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. పెళ్లికి సంబంధించి వధూవరుల సంతకాలు తీసుకోవడం వంటి పనులు కూడా మిగతావారు అలా పాక్కుంటూనే చేశారు.
Comments
Please login to add a commentAdd a comment