ఫేస్‌బుక్‌లో ‘అవును’ అన్నందుకు అరెస్ట్ | Thailand lese majeste: Woman charged over single word used on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో ‘అవును’ అన్నందుకు అరెస్ట్

Published Tue, Aug 2 2016 6:18 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌లో ‘అవును’ అన్నందుకు అరెస్ట్ - Sakshi

ఫేస్‌బుక్‌లో ‘అవును’ అన్నందుకు అరెస్ట్

బ్యాంకాక్ : ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజుల్లో కూడా థాయ్‌లాండ్ ప్రజులెవరూ ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా పన్నెత్తు మాట కూడా అనకూడదు. ఫేస్‌బుక్‌లో ప్రభుత్వ పెద్దలను కించపరిచే విధంగా కామెంట్ చేసినా, కామెంట్‌కు సమాధానంగా ‘అవును’ అన్న అక్కడ పెద్ద నేరమే. అందుకు మూడేళ్ల నుంచి 15 ఏళ్ల పాటు కారాగార శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే రాజరిక వ్యవస్థలో పుట్టుకొచ్చిన ‘లెసే మెజెస్టే’ ఆటవిక చట్టం అక్కడ ఇప్పటికీ కొనసాగుతుండడమే.

పట్నారి చంక్‌జీ అనే 40 ఏళ్ల మహిళ ఫేస్‌బుక్‌లో తనకు వ్యక్తిగతంగా వచ్చిన పోస్ట్‌కు స్థానిక భాషలో అవుననే అర్థంలో ‘జా’ అని సమాధానం ఇచ్చినందుకు సైనిక మద్దతుతో నడుస్తున్న థాయ్‌లాండ్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. జా అంటే ఆంగ్ల భాషలో సమానార్థం ‘య్యా’ అని చెప్పడమే. బురిన్ ఇంతిన్ అనే ఓ 28 ఏళ్ల యువకుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అంశాలపై చర్చించేందుకు తమరు అంగీకరిస్తారా? అంటూ గత ఏప్రిల్ నెలలో తకు ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్ట్‌కు పట్నారి చంక్‌జీ ‘జా’ అంటూ స్పందించారు. ఇంతకు ఆ యువకుడు ఏ అంశాల గురించి చర్చించాలనుకున్నారో వెలుగులోకి రాలేదు. గత ఏప్రిల్ నెలలోనే బురిన్ ఇంతిన్ అరెస్ట్ చేసిన థాయ్ ప్రభుత్వం ఇటీవల పట్నారిని అరెస్ట్ చేసింది. అమెరికాతోపాటు ఇతర అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు. ఆమెపై విచారణను కొనసాగించమని థాయ్ సైన్యం హామీ ఇచ్చినప్పటీకీ సోమవారం నాడు నేరారోపణలు దాఖలు చేశారు.

థాయ్‌లాండ్ రాచరిక వ్యవస్థను ప్రజలు విమర్శించకుండా ఉండేందుకు 1908లో థాయ్‌లాండ్ ‘మెజెస్టే’ చట్టాన్ని తీసుకొచ్చారు. 1932లో దీన్ని మరింత కఠినం చేశారు. నాటి నుంచి 2007 వరకు థాయ్‌లాండ్ రాజ్యాంగానికి 17 సార్లు  సవరణలు జరిగినా ఈ చీకటి చట్టాన్ని మాత్రం సవరించలేదు. 1990 నుంచి 2005 వరకు ఈ చట్టం కింద ఏడాదికి నాలుగైదు కేసులు దాఖలు కాగా, 2006లో సైనిక కుట్ర జరిగి కొత్త రాచరిక వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2011 వరకు 400 కేసులు దాఖలయ్యాయి. 2013లో ఈ చట్టం ప్రస్తుత రాజ కుటుంబీకులకే కాకుండా మాజీ రాచరిక కుటుంబ సభ్యులను విమర్శించినా వర్తిస్తుందని ఆ దేశం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

2014లో సైనిక తిరుగుబాటు ద్వారా ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ పీస్ అండ్ ఆర్డర్’ పేరిట కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నాటి చట్టాన్ని ప్రయోగించడం గమనార్హం. దేశంలో కొత్త ప్రజాస్వామిక ఉద్యమంలో పనిచేస్తున్న పట్నారి కుమారుడు సిరావిత్ సెరిత్వాత్‌ను అణచివేయడంలో భాగంగానే ఆయన తల్లిని అరెస్ట్‌చేసి విచారిస్తున్నారని స్థానిక ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తున్నారు. థాయ్ సైన్యానికి మరిన్ని అధికారాలు కల్పిస్తూ రూపొందించిన కొత్త రాజ్యాంగంపై వచ్చేవారమే ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఈ తాజా పరిణాలు చోటు చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement