
ఘటనాస్థలిలో ఫేస్‌బుక్ లైవ్‌లో నిందితుడు
బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఓ సైనికుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 20 మందిని పొట్టనబెట్టుకున్నాడు. థాయిలాండ్‌లోని నఖోన్ రట్చసిమా నగరంలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. నగరంలోని సైనిక స్థావరం నుంచి ఒక సైనిక వాహనాన్ని దొంగిలించిన సైనికుడు సర్జంట్ మేజర్ జక్రపంత్ తొమ్మా నగరం నడిబొడ్డుకు దాన్ని నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడి టెర్మినల్ 21మాల్‌లో ప్రవేశించి మెషీన్ గన్‌తో అక్కడ ఉన్నవారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది గాయాలపాల య్యారు.
ప్రాణాలు కోల్పోయిన వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. కాల్పులకు సంబంధించిన ఫొటోలను స్వయంగా నిందితుడే తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ‘నేను లొంగిపోవాలా? మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు’ అంటూ ఒక పోస్ట్, ‘నేను అలసిపోయాను.. ఇక గన్ ట్రిగ్గర్‌ను లాగలేను’ అంటూ మరో పోస్ట్ పెట్టాడు. ప్రజలంతా భయపడుతూ పరిగెత్తడం మరో వ్యక్తి తీసిన వీడియోలో కనిపించింది. ఫేస్‌బుక్ దాన్ని తొలగించింది. నిందితుడు మాల్‌లో ఉన్నాడు. మాల్ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకొని రాకపోకలను నిషేధించారు. అయితే 16 మందిని అతడు నిర్బంధించాడని స్థానిక మీడియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment