
పామును చూస్తే చాలు అయ్య బాబోయ్ అంటూ ఆమడ దూరం పరుగెడుతాం. అది కనిపించిన ప్రదేశానికి మరోసారి వెళ్లాలంటేనే జంకుతాం. కానీ ఓ మహిళ మాత్రం పామును భయపడలేదు. టాయిలెట్‌లోకి వచ్చిన పాముతో యుద్ధమే చేసింది. తనను కాటు వేసినా.. తన మెడను గట్టిగా బిగించినా.. అదరకుండా.. బెదరకుండా పాముతో పోరాటం చేసింది. చివరకు పామును చంపి.. తాను ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జనవరి 12న జరిగింది. ఆ పాము నుంచి మహిళ ఎలా తప్పించుకుందో ఆమె కూతురు సోషల్ మీడియా ద్వారా వివరించింది. ఇకపై బాత్రూంకు వెళ్లే ముందు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి వెళ్లాలని కోరింది.
‘మాది అడవికి దూరంగా ఉన్న ఓ చిన్న పల్లెటూరు. ఈ నెల 12న మా అమ్మ టాయిలెట్‌కు వెళ్లింది. అప్పటికే ఓ పెద్ద పాము అందులోకి వచ్చి చేరింది. అమ్మ వెళ్లగానే అది బుసలు కొడుతూ అమ్మ తొడను కరిచింది. దాంతో అగకుండా తొడ భాగాన్ని గట్టిగా చుట్టేసింది. అమ్మ గట్టిగా అరవడంతో మేమంతా బాత్రూం దగ్గరకి వెళ్లాం. పెద్ద పామును చూసి మేమంతా భయపడినా అమ్మ మాత్రం భయపడలేదు. పామును వదిలించేందుకు గట్టి ప్రయత్నం చేసింది. రెండు చేతులతో పామును తోకను పట్టుకొని గట్టిగా లాగింది. అయినా ఫలితం లేదు. చివరికి మా సోదరుడి ద్వారా సుత్తె, కత్తిని తెప్పించుకొని పామును పొడిచి చంపింది. ఈ ప్రయత్నంలో మా అమ్మ శరీరానికి కూడా కత్తిపోట్లు పడ్డాయి. పాము బారి నుంచి బయటపడిన అమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాం. ఇప్పుడు అమ్మ ఆరోగ్యంగా ఉంది. మీ ఇల్లు అడవికి దూరంగా ఉన్నప్పటికీ... టాయిలెట్‌లోకి వెళ్లేముందు గదిని క్షుణ్ణంగా పరిశీలించి వెళ్ళండి’ అని మహిళ కూతురు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment