ఇంకా వీడని మిస్టరీ | The belief is still a mystery | Sakshi
Sakshi News home page

ఇంకా వీడని మిస్టరీ

Published Sat, Jan 3 2015 3:44 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

ఇంకా వీడని మిస్టరీ - Sakshi

ఇంకా వీడని మిస్టరీ

  • లభించని బ్లాక్‌బాక్సు
  •  సముద్ర ఉపరితలంపై 5 కి.మీ. పరిధిలో విమాన శకలాలు
  • జకార్తా: వారం రోజులు కావొస్తున్నా ఎయిర్ ఆసియా విమాన ప్రమాదం మిస్టరీ వీడడం లేదు. బ్లాక్‌బాక్సు దొరకకపోవడంతో అసలు ఈ దుర్ఘటనకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదు. ప్రతికూల పరిస్థితుల వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మృతదేహాల కోసం అన్వేషక బృందాలు ఇంకా గాలిస్తున్నాయి. ఇప్పటిదాకా 30 మృతదేహాలను గుర్తించారు. సముద్రపై ఐదు కి.మీ. పరిధిలో విమాన శకలాలు తేలియాడుతున్నాయి.

    విమానం సముద్ర గర్భంలో చేరడంతో చాలామంది ప్రయాణికులు వారి సీట్లలోనే కన్నుమూసి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘బలమైన గాలులు వీస్తున్నాయి. ఆదివారం వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కడలి అల్లకల్లోలంగా ఉండడంతో అలలు నాలుగు మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి. శుక్రవారం వరకు 30 మృతదేహాలు గుర్తించగా.. 21 భౌతికకాయాలను స్వాధీనం చేసుకున్నాం.

    విమానం అతిపెద్ద శకలాన్ని, బ్లాక్‌బాక్సును గుర్తించే గురుతర లక్ష్యాలు మా ముందున్నాయి’ అని ఇండోనేసియా జాతీయ   సహాయక, అన్వేషణ విభాగం చీఫ్ సొలిస్టియో తెలిపారు. పెద్ద విమాన శకలాన్ని గుర్తించేందుకు వీలుగా నేవీకి చెందిన నౌకలు అన్వేషణ కొనసాగిస్తున్నాయన్నారు. 90 నౌకలతోపాటు అనేక విమానాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయన్నారు.

    ఇండోనేషియా, మలేసియా, సింగపూర్, ఫ్రాన్స్, అమెరికాకు చెందిన నిపుణులు అత్యాధునిక పరికరాలతో గాలింపు చేపడుతున్నారన్నారు. సహాయక చర్యల కోసం 72 మంది సిబ్బందితో కూడిన రెండు రష్యా విమానాలు మలేసియా చేరుకున్నాయి. స్వాధీనం చేసుకున్న మృతదేహాల్లో ఎనిమిదింటిని సురబయకు చేరవేశారు. వేలిముద్రల ఆధారంగా ముగ్గురిని ఇండోనేసియాకు చెందినవారిగా గుర్తించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement