
ఈజిప్టు మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
జైలు నుంచి తప్పించుకున్న కేసులో కోర్టు తీర్పు
100 మందికిపైగా మరణదండన
కైరో: తిరుగుబాటు సమయంలో వేలాదిమంది జైలు నుంచి పారిపోయేందుకు కారణమైన కేసులో ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ (63), నిషేధిత ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ చీఫ్ మొహమ్మద్ బేడీలతోపాటు 100మందికిపైగా ఇస్లామిస్టులకు ఇక్కడి కోర్టు మరణశిక్ష విధించింది.
2011 నాటి ఘటన కేసులో మోర్సీ, బ్రదర్‌హుడ్ నాయకులు బేడీ, మొహమ్మద్ సాద్ ఎల్-ఖటట్ని, ఎసామ్ ఎల్-ఎరియన్, మొహమ్మద్ ఎల్-బెట్లగీ సహా మొత్తం 104 మందికి కోర్టు మరణదండన విధించింది. శనివారం జడ్జి మరణ శిక్ష తీర్పును చదువుతుండగా, బోనులో ఉన్న మోర్సీ ధిక్కారధోరణితో పిడికిలి బిగించి చేయి పెకైత్తారు. ఈజిప్టు పాలకుల్లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న వారిలో మోర్సీనే తొలి వ్యక్తి.
ముగ్గురు జడ్జిల కాల్చివేత: ఈజిప్ట్‌లోని సినాయ్‌లో శనివారం ముగ్గురు జడ్జిలను ఉగ్రవాదులు కాల్చిచంపారు. వారిని కారులో తీసుకువెళ్తున్న డ్రైవర్‌ను కూడా చంపేశారు. వీరు ఇస్మాయిలియా నుంచి ఎల్-ఐరిష్ ప్రాంతానికి వెళ్తుండగా దాడి జరిగింది.