పాక్‌లో ‘ఉగ్ర’ స్థావరాలను ఒప్పుకోం | The 'India Today' Interview with President Obama | Sakshi
Sakshi News home page

పాక్‌లో ‘ఉగ్ర’ స్థావరాలను ఒప్పుకోం

Published Sat, Jan 24 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

పాక్‌లో ‘ఉగ్ర’ స్థావరాలను ఒప్పుకోం

పాక్‌లో ‘ఉగ్ర’ స్థావరాలను ఒప్పుకోం

భారత్ నిజమైన అంతర్జాతీయ భాగస్వామి
* భారత్-అమెరికా బంధానికే అత్యధిక ప్రాధాన్యం
* ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో ఒబామా..  మోదీపై ప్రశంసల వర్షం

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ప్రాంతాలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండ టాన్ని అంగీకరించేది లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టంచేశారు. భారత్‌ను నిజమైన అంతర్జాతీయ భాగస్వామిగా అభివర్ణించారు. ముంబై దాడుల వెనకున్న కుట్రదారులకు తగిన శిక్ష పడాల్సిందేనన్నారు.

‘ఇండియా టుడే’ వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పత్రిక తదుపరి సంచికలో అమెరికా ఈ ఇంటర్వ్యూని ప్రచురించనుంది. భారత గణతంత్ర వేడుకల్లో ఒబామా ముఖ్యఅతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదంపై పోరులో అమెరికా వెనక్కి తగ్గేది లేదని, ఇందుకోసం భారతీయులు, అమెరికన్లు ఏకమవుతారని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాతో సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ప్రధాని మోదీ చూపుతున్న చొరవతో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని దృఢం చేసుకునేందుకు తమకు మరో గొప్ప అవకాశం లభించిందన్నారు.

భారత్, అమెరికాలు నిజమైన అంతర్జాతీయ భాగస్వాములుగా మారాలన్న తన లక్ష్యం నెరవేరే సమయం వచ్చిందన్నారు.  అందుకే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనే తొలి అమెరికా అధ్యక్షుడిగా భారత్ ఆహ్వానాన్ని ఆమోదించినట్లు చెప్పారు. భారత్‌లో రెండుసార్లు పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడిగా కూడా ఒబామా ప్రత్యేకత చాటుకోనున్నారు. 2010లో పర్యటించిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత్-అమెరికా భాగస్వామ్యం విజయవంతం కావాలని అభిలషించారు.

పరస్పర గౌరవంతో ఇరుపక్షాల ప్రయోజనాలను గుర్తించి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ దిశగానే ఇరు దేశాలు సాగుతున్నాయని ఒబామా పేర్కొన్నారు.  ద్వైపాక్షిక బంధానికి గట్టి పునాది వేసేందుకు ఈ పర్యటనను సద్వినియోగం చేసుకుంటానన్నారు.  తన విదేశాంగ విధానంలో భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యముంటుందన్నారు. ప్రపంచ భద్రత కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ఉద్ఘాటించారు.

ప్రధాని మోదీపై ఒబామా ప్రశంసలు కురిపించారు. ఆయన చాయ్‌వాలా స్థాయి నుంచి ప్రధానిగా ఎదగడాన్ని బట్టి.. విజయం సాధించడానికి భారతీయుల సంకల్ప బలం ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. భారత్ అభివృద్ధి కోసం మోదీకి నిర్దిష్ట దృక్పథముందని పేర్కొన్నారు.
 
25, 29న కార్యాలయాల మూసివేత

గణతంత్ర దినోత్సవ పరేడ్, బీటింగ్ రిట్రీట్ వేడుక సందర్భంగా ఈ నెల 25, 29న నార్త్, సౌత్ బ్లాకులు, వాటి సమీపంలోని కార్యాలయాలను తొందరగా మూసివేయనున్నట్టు శిక్షణ సిబ్బంది శాఖ శుక్రవారం తెలిపింది.
 
‘అణు’ చర్చల్లో పురోగతి!
లండన్: అమెరికాతో అణు ఒప్పందంలో ప్రతిష్టంభన తొలగించేందుకు భారత్ అనేక మార్గాలను అన్వేషిస్తోంది. అణు సరఫరాదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న ‘అణు పరిహార చట్టం’లోని నిబంధనలపై దృష్టి సారించింది. ఈ చట్టంపై విదేశీ అణు సరఫరాదారుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందని తెలపనుంది. అణు ప్రమాదాలు చోటుచేసుకుంటే సరఫరాదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు విపత్తు బాండ్లు జారీ చేయాలని భావిస్తోంది.

అమెరికాతో ఈ ఒప్పందాన్ని పట్టాలెక్కించేందుకు ఇరుదేశాల ఉన్నతాధికారులు లండన్‌లో చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు ప్రతిపాదనలపై చర్చించారు. విపత్తు బాండ్ల జారీ ప్రతిపాదనను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏ) ముందుకు తెచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.   కీలకమైన అంశాలపై పురోగతి కనిపించిందని, మరికొన్నింటిపై రాజకీయస్థాయిలో నిర్ణయాలు జరగాల్సి ఉందని పేర్కొన్నాయి. పౌర అణు పరిహార చట్టం-2010 ప్రకారం అణు రియాక్టర్ల నిర్వాహకులు ముందుగానే రూ.1,500 కోట్లను పక్కన పెట్టాలి. ప్రమాదం జరిగితే ఈ మొత్తాన్ని బాధితులకు అందించేందుకు వీలుగా చట్టంలో ఈ నిబంధన పొందుపరిచారు.

నిర్వహకులు అణుసరఫరాదారుడి నుంచి పరిహారం అడిగే హక్కునూ చట్టంలో కల్పించారు. అణురియాక్టర్లకు బీమా రక్షణ కల్పించాలని జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ(జీఐసీ)కి ప్రభుత్వం సూచించింది. విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించాలని సర్కారు యోచిస్తోంది. రూ.1,500 కోట్ల నిధిని సమకూర్చడం ప్రభుత్వ బీమా కంపెనీలకు భారంగా మారింది. నిబంధనల ప్రకారం వీటిద్వారా రూ.750 కోట్లు మాత్రమే సమకూరే అవకాశం ఉంది. దీంతో విదేశీ కంపెనీలకు ఇందులో చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీమా కిందకు రాని అణు నష్టాలను ‘విపత్తు బాండ్ల’ ద్వారా భరించేలా కసరత్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement