న్యూఢిల్లీ : రాజకీయాలపరంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ బద్ధ శత్రువులనే చెప్పవచ్చు. అయితే ఈ వైరం కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం. ఈ క్రమంలో ఇండియాటుడే మ్యాగ్‌జైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ప్రధాని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ నుంచి ఎలాంటి లక్షణాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారని విలేకరి ప్రశ్నించారు. రాహుల్ ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘మోదీ ఒకే సమయంలో వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు సందేశాలు ఇస్తారు. ఆ లక్షణాన్ని నేను కూడా అలవర్చుకోవాలనుకుంటున్నాను’ అని తెలిపారు.
‘కానీ అది సాధ్యం కావడం లేదు. అలా ప్రయత్నించిన ప్రతిసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇది చాలా గొప్ప లక్షణం. ఎందుకంటే ఇప్పుడు మీతో ఒక విషయం చెప్తూ.. సరిగ్గా అదే సమయంలో మరో వ్యక్తికి మరో విషయం చెప్పడం నిజంగా గొప్ప విషయమే కదా’ అన్నారు రాహుల్. అంతేకాక ‘ఈ మధ్య కాలంలో నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. దానిలో ఆయన నరేంద్ర మోదీని కేవలం నరేంద్ర మోదీ మాత్రమే సవాలు చేయగలరని పేర్కొన్నారు. అది విని నా మైండ్ బ్లాక్ అయ్యింద’న్నారు రాహుల్.
ఎందుకంటే ‘ప్రతి వ్యక్తి.. ప్రతి విషయం నాకొక సవాలుగానే కనిపిస్తుంది. నాకు కొన్ని విషయాలు తెలుసు.. మరికొన్నింటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ప్రతి దాని గురించి తెలుసుకోవాలని లేదు. ప్రతీది తెలుసుకోవడం అంటే పిచ్చితనానికి నిదర్శనం అవుతుంది. కానీ నేను సాధరణ మనిషిని’ అని పేర్కొన్నారు. 2014 ఎన్నికల ఓటమి తనకు చాలా మంచి పాఠం నేర్పిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment