వారానికోసారి ఛార్జింగ్ చేస్తే చాలు
అదరగొట్టే స్మార్ట్ ఫోన్లలో అనేకానేక ఆప్షన్లు. ఇంటర్నెట్ నుంచి గేమ్‌ల వరకు అన్నీ అత్యాధునికమే. మరి అన్ని వాడేస్తుంటే బ్యాటరీ ఎంతసేపు వస్తుంది? రోజుకు కనీసం రెండు, మూడు సార్లు చార్జింగ్ పెట్టాల్సి రావడం దాదాపు అందరికీ అనుభవమే. ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు నడుం కట్టారు. పదేపదే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. మొబైల్, టాబ్లెట్, స్మార్ట్ వాచీలలో ఉపయోగించే స్క్రీన్ గ్లాస్ మెటీరియల్‌ను వాళ్లు మార్చారు. ఈ కొత్త మెటీరియల్ అసలు బ్యాటరీ పవర్‌ను వాడుకోదు.
సాధారణంగా స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పవర్‌లో 90 శాతం వరకు స్క్రీన్‌కు వెలుతురు ఇవ్వడానికే ఉపయోగపడుతుంది. ఇన్నాళ్లూ అందరూ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంపైనే దృష్టిపెట్టారు. కానీ బ్రిటిష్ శాస్త్రవేత్తలు మాత్రం.. స్క్రీన్ ఉపయోగించుకునే బ్యాటరీ పవర్‌ను తగ్గించాలని ప్రయత్నించి.. విజయం సాధించారు. తాము కనిపెట్టిన స్మార్ట్ గ్లాస్ ఉపయోగిస్తే.. ఫోన్లు, టాబ్‌లు, స్మార్ట్ వాచీలను కేవలం వారానికి ఒకసారి చార్జింగ్ చేస్తే సరిపోతుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్ డాక్టర్ పీమన్ హొస్సేనీ తెలిపారు.
ఈ కొత్త స్మార్ట్ గ్లాస్ కొన్నిరకాల ఎలక్ట్రికల్ పల్స్‌లను సృష్టిస్తుంది. దీనివల్ల మంచి ఎండలోనైనా ఫోను బ్రైట్‌నెస్ ఏమాత్రం పెంచక్కర్లేకుండా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పటివరకు అది సాధ్యమయ్యేది కాదు. ఎండలో ఉంటే తప్పనిసరిగా స్క్రీన్ బ్రైట్‌నెస్ పెంచుకోవాల్సి వచ్చేది. ఈ కొత్త తరహా స్మార్ట్ గ్లాస్ నమూనాను ఓ ఏడాదిలోపే అందుబాటులోకి తెస్తామంటున్నారు. ఇలాంటివి వస్తే.. ఇక పవర్ బ్యాంకులకు కూడా కాలం చెల్లిపోతుందేమో!!