సముద్రంలో విమానం తోక
- ఏయిర్ ఆసియా విమానానిదేనని ధ్రువీకరణ
జకార్తా/సింగపూర్: జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఆసియా విమానం తోక భాగాన్ని బుధవారం గుర్తించారు. దీంతో ప్రమాద కారణం తెలుసుకోవడానికి వీలు కల్పించే బ్లాక్‌బాక్స్ స్వాధీనంపై ఆశలు పెరిగాయి. బ్లాక్ బాక్స్ విమానం తోక భాగంలోనే ఉంటుంది. తోక భాగంలో ఒక సిగ్నల్‌ను గుర్తించామని, అయితే డైవర్లు దాన్ని మరోసారి గుర్తించలేకపోయారని అధికారులు చెప్పారు. సిగ్నల్ గుర్తించడంతో బ్లాక్స్ బాక్స్ కూడా దొరుకుందని భావిస్తున్నారు.
‘విమానం చివరిసారిగా కనిపించిన ప్రాంతానికి 30 కి.మీ. దూరంలో విమాన తోక భాగం కనిపించింది. దానిపై ఎయిర్ ఆసియా అక్షరాలు ఉన్నాయి. సముద్ర గర్భంలో తీసిన ఫొటోల్లోని విమానం ప్రమాదానికి గురికాకముందు తీసిన విమానం మాదిరే ఉంది. అది ఎయిర్ ఆసియా విమానానిదేనని ధ్రువీకరిస్తున్నాను’ అని ఇండోనేసియా జాతీయ అన్వేషణ, సహాయక సంస్థ చీఫ్ బాంబంగ్ సొలలిస్తియో జకార్తాలో తెలిపారు.
గత నెల 28న ఇండోనేసియా నుంచి 162 మంది తో సురబయ వెళ్తున్న ఎయిర్ ఆసియా విమానం అదే రోజు సముద్రంలో కూలడం తెలిసిందే. ఇప్పటివరకు 40 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీశారు. మిగతా మృతదేహాలు విమానంలోపలే చిక్కుకుని ఉంటాయని భావిస్తున్నారు. గాలింపు ప్రాంతాన్ని విస్తరించారు. 30 మీటర్ల లోతులో 10 అడుగుల పొడవున్న తోక భాగాన్ని వెలికి తేసేందుకు భూగర్భ వాహనాన్ని వినియోగించనున్నారు.