చైనాలో ఎంతమంది బాహుబలులో!
బాహుబలి సినిమా చూశారు కదూ.. అందులో శివుడి పాత్రధారి ప్రభాస్ నీళ్ల కొండ ఎక్కడానికి చాలా కష్టపడతాడు. ఎట్టకేలకు కొండ ఎక్కి.. హీరోయిన్‌ను కలుస్తాడు. చైనాలో కూడా అలాంటిదే ఓ పెద్ద కొండ ఉంది. కానీ ఆ కొండను ఎక్కేది మాత్రం చైనా బాహుబలి కాదు.. స్కూలు పిల్లలు! అవును, ప్రపంచానికి దూరంగా మారుమూల కొండ ప్రాంతంలో ఉండే ఓ కుగ్రామానికి చెందిన పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే 2,624 అడుగుల ఎత్తున్న కొండను ఎక్కాలి. మళ్లీ ఇళ్లకు రావాలంటే దిగాలి. కొండ ఎక్కేందుకు వారికి రెండు గంటల సమయం పడుతుంది. అలా ఎక్కడం కూడా చాలా కష్టమైన, ప్రమాదకరమైన పని.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అలా కొండ ఎక్కుతున్న పిల్లలను చూస్తే మనకే గుండె ఝల్లుమంటుంది. కానీ గట్టిగా ఆరేళ్ల వయసు కూడా లేని పిల్లలు సైతం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఆ కొండ ఎక్కి స్కూలుకు వెళ్తుంటారు. పర్వత పాదం వద్ద వాళ్ల ఇళ్లుంటే.. స్కూలు ఉండేది మాత్రం కొండ మీద. నిజానికి కొండ ఎక్కడం కంటే, దిగడం ఇంకా చాలా కష్టమైన పని. ఆరేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు వయసున్న పిల్లలు అలా కొండ ఎక్కి, దిగి.. స్కూలుకు, అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంటారు. దానికితోడు వాళ్ల భుజాల మీద బరువైన బ్యాగులు కూడా ఉంటాయి. వాళ్లు పడిపోకుండా చూసేందుకు ముగ్గురు పెద్దవాళ్లు కూడా వాళ్లతోపాటు ఉంటారు.
ఈ పిల్లలంతా ఉండే కుగ్రామంలో కేవలం 72 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. అయితే ఇలా ప్రతిరోజూ కొండ ఎక్కి వెళ్లడం కష్టం కాబట్టి, ఒకసారి స్కూలుకు వెళ్లారంటే రెండు వారాల పాటు అక్కడే ఉండిపోతారు. ప్రతిసారీ వాళ్లు కొండ ఎక్కేటప్పుడు తల్లిదండ్రులు వంతులవారీగా పిల్లలతోపాటు వెళ్తారు. పెద్దవాళ్లయితే గంటలోనే కొండ ఎక్కేస్తారు. కానీ పిల్లలకు కష్టం కాబట్టి కొండ మీద ఇనుప రాడ్లతో నిచ్చెన ఒకదాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఇలా కొండ ఎక్కుతూ జారి పడిపోయి ఇప్పటికి 8 మంది మరణించారు. బాగా వర్షం, మంచు పడే సమయంలో కొండ ఎక్కడం, దిగడం కూడా చాలా కష్టం అవుతుంది.
అందుకే కొంతమంది పిల్లలను అసలు చదువుకోడానికి కూడా పంపడం లేదు. స్కూలు నుంచి ఊరి వరకు రోడ్డు లాంటిది వేయాలని స్థానికులు కోరినా, అక్కడ ఉండేది తక్కువ మంది కావడం, ఖర్చు ఎక్కువ అవుతుండటంతో ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. పోనీ గ్రామం నుంచి సమీపంలోని వేరే పట్టణానికి వాళ్లను తరలిద్దామంటే అక్కడ వాళ్లకు భూమలు ఉండవు, ఉద్యోగాలూ దొరకవు. కొండ దిగువన గ్రామంలో అయితే మంచి పంటలు పండుతాయి. గ్రామం నుంచి స్కూలుకు రోడ్డు వేయాలంటే దాదాపు రూ. 61 కోట్ల ఖర్చవుతుంది. అందుకే ప్రభుత్వం కూడా ఈ బాల బాహుబలుల విషయాన్ని పట్టించుకోవడం లేదు.