యురా.. వెంటనే తేరా..
ఉదయాన్నే నిద్ర లేవాలి. లేవగానే.. బెడ్ కాఫీ తాగందే మీరు మంచం నుంచి కిందకు దిగరు. ఇచ్చేవారే లేరు..సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి తిరిగి ఇంటికి వచ్చారు. మీకిష్టమైన మందు లేదా కాక్‌టైల్ తయారుచేసుకునే ఓపిక లేదు.. కానీ తాగాలని మాత్రం ఉంది.
ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం.. ‘యురా’. ఒరేయ్ యురా అంటూ ఈ ఎగిరే రోబో బార్‌టెండర్‌కు మీరు వాయిస్ కమాండ్ ఇస్తే.. ఉదయాన్నే నిద్రలేపడమే కాకుండా.. మీకు కావాల్సిన కాఫీని క్షణాల్లో కలిపి ఇచ్చేస్తుంది.. సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగొచ్చి.. ఫ్రెషప్ అయ్యేసరికి మీకిష్టమైన కాక్‌టైల్‌ను రెడీ చేసి పెడుతుంది. ‘యురా’.. ఈ ఎగిరే రోబో బార్‌టెండర్ డిజైన్ సృష్టికర్త ఉక్రెయిన్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అండ్ అర్కిటెక్చర్ విద్యార్థి హెర్మాన్ హేడిన్. ప్రస్తుతం ఈ డిజైన్ 2014 ఎలక్ట్రొలక్స్ డిజైన్ ల్యాబ్ అవార్డుకు పోటీ పడుతోంది. ‘యురా’లో మనకు కావాల్సినవి నింపి పడేస్తే.. మనకు కావాల్సిన టైంలో అది మనకు అవి అందిస్తుంది. గ్లాస్ ముందు పెడితే చాలు.. కాక్‌టైల్ చేసి, ఇచ్చేస్తుంది. పైగా.. ఇందులో కాఫీని వేడిగా.. మందును చల్లగా ఉంచే సదుపాయమూ ఉంది. అంతేకాదు.. అది ఎంత ఉష్ణోగ్రతలో ఉందన్న విషయాన్ని బయట ఉండే తెరపై ప్రదర్శిస్తుంది. దీంతోపాటు అందులో ఉండే కేలరీలు, కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్, ప్రొటీన్ల వివరాలనూ తెలుపుతుంది. ‘యురా’ వైఫై ఆధారంగా వాయిస్ కమాండ్స్‌కు అనుగుణంగా పనిచేస్తుంది.