ఆరువేల మంది ఒకేసారి నగ్నంగా..!
బొగోటా: మనుషులను సామూహికంగా నగ్న చిత్రాలు తీయండంలో నేర్పరి అయిన అమెరికన్ ఫోటోగ్రఫర్ స్పెన్సర్ ట్యూనిక్ ఇచ్చిన పిలుపు మేరకు 6000 మంది కొలంబియా ప్రజలు సోమవారం తమ ఒంటిపై ఉన్న వస్త్రాలను విప్పేశారు. 7 డిగ్రీల చలివాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా శరీరంపై నూలిపోగు లేకుండా బొగోటా నగరంలోని మెయిన్ సెంటర్లో నిల్చుని ఫోటోలకు పోజులిచ్చారు. గత ఆరేళ్ల కాలంలో స్పెన్సర్ సామూహిక నగ్న చిత్రాల్లో ఇదే అతిపెద్దది కావటం విశేషం.
కొలంబియాలోని లెఫ్టిస్ట్ తిరుగుబాటుదారులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలన్న నినాదంతో ప్రజలు ఈ సామూహిక నగ్న ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ' నగ్నంగా మారిపోవడం సంతోషంగా ఉంది. మేమంతా గర్వాన్ని పక్కనబెట్టి మౌనంగా, శాంతిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇది యూనిటీకి చిహ్నంగా ఉంటుంది' అని ఫోటో సెషన్లో పాల్గొన్న బెర్రియాంటొస్(40) వెల్లడించారు. 'ఇది నిజంగా కొత్త అనుభవం. మనం ప్రపంచంలోకి ఎలా వస్తామో అలాగే ఫోటో సెషన్లో పాల్గన్నాం' అని బెల్ట్రాన్(20) తెలిపాడు.
ఈ ఫోటో సెషన్తో ప్రభుత్వం శాంతి చర్చల దిశగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఫోటోగ్రాఫర్ ట్యూనిక్ వెల్లడించారు. కొలంబియా వివాదం రైతుల తిరుగుబాటుతో 1960లలో మొదలైంది.