లండన్ : వందలాది మంది కశ్మీరీ మద్దతుదారులు లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. జమ్మూకశ్మీర్ అంశంపై ఈ రోజు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రహస్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో వారు భారత కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. పాక్ జెండాలు, కశ్మీరీ జెండాలు పట్టుకుని బ్యానర్లు ప్రదర్శిస్తూ కశ్మీరీకి స్వేచ్ఛనివ్వండంటూ నినాదాలు చేశారు. భారత్ కశ్మీర్‌ను నిర్భందించి ఎటువంటి సమాచారం బయటకు రాకుండా కట్టడి చేస్తోందని ఫిర్యాదు చేశారు.
జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించడానికి ఐరాస భారతదేశంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థించారు. నిరసనకారులకు నేతృత్వం వహిస్తోన్న సుమైయా షా అనే మహిళ మాట్లాడుతూ.. గత 12 రోజులుగా కశ్మీర్‌లో ఉంటున్న మా తల్లిదండ్రులతో మాట్లాడలేక పోతున్నానని చెప్పారు. భారతదేశం మొత్తం కశ్మీర్ జనాభాను నిర్భందించడమేగాక ఆ ప్రాంతాన్ని కర్ఫ్యూ నీడలో ఉంచిందని విమర్శించారు. ‘నా తల్లిదండ్రులకు సరైన ఆహారం, ఔషద మందులు లభిస్తున్నాయో.. లేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 5న భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి లండన్‌లో భారత వ్యతిరేక నిరసనలు ఎక్కువయ్యాయి. కాగా, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని శుక్రవారం గోప్యంగా జరుపుతున్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment