పరువు కోసం మహిళల్ని పిట్టల్లా..
ఫైసలాబాద్: పాకిస్తాన్లో ఇటీవల పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. మహిళల వల్ల కుటుంబ పరువు మంటగలుస్తోందని భావిస్తున్న కొందరు పురుషులు పాశవికంగా హత్యలకు పాల్పడుతున్నారు. బుధవారం ఫైసలాబాద్ జిల్లాలోని ఒకే ఇంట్లో జహర, ఫర్జానా, నస్రీన్ అనే ముగ్గురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. కాల్పుల శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకునే సరికే ముగ్గురు మహిళలు రక్తపు మడుగులో నిర్జీవంగా పడిఉన్నారు. కాల్పులు చోటుచేసుకోవడానికి ముందు కుటుంబంలోని పురుషులు మహిళలతో పెద్ద ఎత్తున వాగ్వాదం చేసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనను పరువు హత్యలుగా పోలీసులు వెల్లడించారు. హత్యకు పాల్పడిన వారు పరారీలో ఉన్నారు.
దేశంలో ఇటీవల పెరిగిపోతున్న పరువు హత్యల పట్ల అక్కడి సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. చంపడం ద్వారా కుటుంబ గౌరవం పెదగదంటూ నినాదాలు చేస్తున్నారు. ఒక్క 2015లోనే పరువు హత్యల మూలంగా 1,100 మంది మహిళలు తమ కుటుంబంలోని పురుషుల చేతిలో దారుణంగా హతమయ్యారని హ్యూమన్ రైట్స్ కమిషన్ వెల్లడించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమౌతోంది.